Work From Home.. Amazon new return-to-office policy: వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్న ఉద్యోగుల్ని జనవరి నుంచి ఆఫీసులకు రప్పించాలనే ప్రయత్నాలపై మళ్లీ కంపెనీల సమీక్షలు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో అమెజాన్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోం లో మునిగిపోయింది ఐటీ ప్రపంచం. వేవ్‌లవారీగా వైరస్ విరుచుకుపడుతున్నప్పటికీ.. వ్యాక్సినేషన్ రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఎంప్లాయిస్‌ను తిరిగి ఆఫీసు గడప తొక్కించే ప్రయత్నాలు చేస్తున్నాయి. క్వాలిటీ ప్రొడక్టవిటీ కోసమే ఈ పని చేయకతప్పడం లేదని చెప్తున్నాయి.
కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్‌తో, మరికొన్ని కంపెనీలు రోస్టర్ విధానంలో, రొటేషన్ షిఫ్ట్‌లలో కొంతమంది ఉద్యోగులను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇదివరకే మెయిల్స్ ద్వారా సమాచారం కూడా అందించాయి. ఇక అమెజాన్ కూడా 2022 జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్ ఆఫీసులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ నిర్ణయం మీదా ఇప్పుడు మరోసారి సమీక్ష నిర్వహించింది అమెజాన్. తద్వారా ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేయబోమని వెల్లడించింది.
ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయా టీంలకే వదిలేసింది అమెజాన్. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ నుంచి అధికారికంగా మెయిల్స్ వెళ్లినట్లు గీక్‌వైర్ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కుటుంబ భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ తరహా వర్క్‌పాలసీ వల్ల కొన్ని సమస్యలూ తలెత్తే అవకాశం ఉండడంతో ప్రొడక్టివిటీ మీద ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని ఉద్యోగులను కోరుతోంది మేనేజ్‌మెంట్. ఇందుకు సంబంధించి పరిష్కారాల కోసం అమెజాన్ లీడర్‌షిప్ టీం పరిష్కారాల సమాలోచనలు చేస్తోంది. జనవరి 3లోపు ఈ వర్క్‌పాలసీకి సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక, విధివిధానాలకు సంబంధించిన బ్లూప్రింట్ అందజేయాలని ఎంప్లాయిస్‌ను, టీఎల్‌లను కోరింది అమెజాన్.
ఇక తప్పనిసరి ఉద్యోగులు, ఎమర్జెన్సీ విభాగాల్లోని ఎంప్లాయిస్ మాత్రం వారంలో మూడు రోజులు ఆఫీసుల నుంచే పని చేయాలని, రెండు రోజులు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపింది. పూర్తిస్థాయి కార్యాకలాపాల మీద రాబోయే రోజుల్లో, అది పరిస్థితులనే సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది అమెజాన్.
Comments
Please login to add a commentAdd a comment