
కరోనా కారణంగా మానవ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ విషయంలో ఎన్నడూ ఊహించని విధంగా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వర్క్ ఫ్రమ్ నుంచి ఆఫీస్‌లో పనిచేసేందుకు ఇష్టపడని మహిళా ఉద్యోగులు..మాకీ ఉద్యోగాలు వద్దు బాబోయ్ అంటూ రిజైన్ చేస్తున్నారు. దీంతో కొత్త ఉద్యోగుల నియామకం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది.
ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..2020తో పోలిస్తే 2021 జనవరి - జూన్ మధ్య కాలంలో ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్న మహిళలు వారి ఉద్యోగాల్ని వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనిచేసే విధానానికి స్వస్తి చెప్పి..ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్స్ పెట్టడమేనని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులు వారి జాబ్స్‌కు రిజైన్ చేస్తున్నారు. ఇలా జాబ్ వదిలేస్తున్న వారిలో 40శాతం నాన్ మేనేజిరియల్ లెవల్, 20శాతం మేనేజిరియల్, కార్పోరేట్ ఎగ్జిగ్యూటీవ్ లెవల్ ఉద్యోగులు ఉన్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది.
అవతార్(avtar)-సీరమౌంట్ సంస్థలు బెస్ట్ కంపెనీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ -2021 పేరిట సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో ఐటీ/ఐటీఈఎస్( information technology enabled services) సెక్టార్‌లలో అట్రిషన్ రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆ అధ్యయనంలో ఆసక్తిరంగా 2016 ఐటీ విభాగంలో 10శాతం మహిళా ఉద్యోగులు పెరగ్గా..వారి సంఖ్య 2021 నాటికి 34.5శాతంగా ఉంది. కానీ అనూహ్యంగా 2020 -2021 మధ్యకాలంలో పెరిగిన మహిళ ఉద్యోగుల శాతం 4.34గా ఉండడం ఐటీ సెక్టార్‌ను కలవరానికి గురి చేస్తుంది. ఇక ఐటీ/ఐటీఈఎస్ విభాగంలో మహిళల ప్రాధాన్యం విషయానికొస్తే.. 2020లో 31 శాతం ఉండగా 2021లో 32.3శాతానికి పెరిగింది. మేనేజిరియల్ లెవల్స్ 2020లో 19శాతం ఉండగా 2021కి 21శాతం పెరిగింది.
ఈ సందర్భంగా అవతార్ ప్రతినిధి మాట్లాడుతూ..వర్క్‌లో ఒత్తిడి,ఆందోళనను తగ్గించుకోవడానికి ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు ఆఫీస్‌కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం శారీరకంగా, మానసికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి మాట్లాడుతూ..కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పుల కారణంగా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగింది.అట్రిషన్ రేటు తగ్గిందని అన్నారు. కానీ ఇప్పుడు రిటర్న్ టూ ఆఫీస్ వల్ల ఉద్యోగం చేయాలనే ఆసక్తి తగ్గి, ఉద్యోగాల్ని వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే కార్యాలయాల్ని ఆరోగ్య పరంగా, సౌకర్య వంతంగా మార్చితే సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment