న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్‌కు చెందిన ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్‌ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్‌గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది.
ప్రాథమిక(బేస్) బిడ్డింగ్‌కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్‌ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment