ప్రేమించలేదని యువతిని రాళ్లతో కొట్టి చంపాడు.. స్నేహితులు కూడా.. | Tamil Nadu: Man Assassinated Girl Not Accepting Love | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని యువతిని రాళ్లతో కొట్టి చంపాడు.. స్నేహితులు కూడా..

Published Thu, Jun 9 2022 6:57 AM | Last Updated on Thu, Jun 9 2022 11:23 AM

Tamil Nadu: Man Assassinated Girl Not Accepting Love - Sakshi

నిందితుడు స్వామిదురై, హతురాలు రోజా(ఫైల్‌)

సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి ఓ యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో రాళ్లతో ఓ యువకుడు.. యువతిని కొట్టి చంపేశాడు. ఆమె సోదరిపై కూడా హత్యాయత్నం చేశాడు. సేలం ఆత్తూరులో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సేలం జిల్లా గంగ వళ్లి సమీపంలోని కుడుమలై గ్రామానికి చెందిన మురుగేషన్‌(45) రైతు. కడంబూరులో లీజుకు పంట పొలాల్ని తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు భార్య దయ(40), పెద్దకుమార్తె నందిని(21),చిన్న కుమార్తె రోజా(19), కుమారుడు విజయ్‌(18) ఉన్నారు. పంట పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమార్తె రోజా నర్సింగా పురంలోని కళాశాలలో బీఏ చదువుతోంది.  

ప్రేమ పేరిట వేధింపులు 
ఆత్తూరు తండయార్‌ పేటకు చెందిన స్వామిదురై(22) చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువు కుంటున్నాడు. కుడుమలైలోని బంధువు చిన్నదురై ఇంటికి ఇటీవల వచ్చాడు. ఆ సమయంలో రోజా అతడి కంట పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరిట వేధించడం మొదలెట్టాడు. ఆమె కోసం తరచూ చెన్నై నుంచి చిన్న దురై ఇంటికి వచ్చి వెళ్లే వాడు. తన సోదరి నందినికి ఈనెల 13న వివాహం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో  స్వామిదురై  వేధింపులు రోజాకు తలనొప్పిగా మారాయి. దీంతో వారం రోజు క్రితం అతడిని తీవ్రంగా మందలించింది. అయినా, అతడు వినలేదు. సోమవారం ఆమె చదువుకుంటున్న కళాశాల వద్దకు వెళ్లి తన ప్రేమను చెప్పడమే కాకుండా, అంగీకరించకుంటే హతమారుస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన రోజా ఈ విషయాన్ని సోదరి నందిని ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.  

పెద్దల పంచాయితీతో ఆగ్రహం 
ఈ వ్యవహారం గ్రామపెద్దల వరకు వెళ్లింది. దీంతో మంగళవారం రాత్రి పంచాయతీ పెట్టారు. ఇకపై స్వామిదురై గ్రామంలోకి రాకూడదని, రోజాను ప్రేమ పేరిట వేధిస్తే పోలీసులకు పట్టిస్తామని అతడి బంధువు చిన్నదురైకు గ్రామపెద్దలు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్వామిదురై ఉన్మాదిగా మారాడు. బుధవారం నందిని వివాహ ఆహ్వాన పత్రికల్ని అందించేందుకు రోజా తల్లిదండ్రులు, సోదరు డు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. తన మిత్రులతో కలిసి రోజా, ఆమె సొదరి నందినిపై దాడి చేశాడు.

ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. వీరి నుంచి అక్కచెల్లెలు తప్పించుకుని పంట పొలంలోని నీటి తొట్టెలోకి దూకేశారు. రక్షించాలని కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే, రోజాను వెంటాడి మరీ ఆ ప్రేమోన్మాది తన మిత్రుల సాయంతో రాళ్లతో కొట్టి పడేశాడు. నందిని కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రోజాను ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న చిన్నదురై, అతడి మిత్రులు సమీపంలోని అడవుల్లో ఉన్నారనే.. సమాచారంతో డీఎస్పీ రామచంద్రన్‌ నేతృత్వంలో గాలింపు చేపట్టారు.

చదవండి: అమలాపురం అల్లర్లలో మరో ఇద్దరి అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement