భర్తను చంపిన భార్యకు జీవితఖైదు | - | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన భార్యకు జీవితఖైదు

Published Tue, Oct 22 2024 2:24 AM | Last Updated on Tue, Oct 22 2024 1:22 PM

కరణంవ

కరణంవారిపల్లెలో హైనా ?

చిత్తూరు అర్బన్‌: కట్టుకున్న భర్తను చంపిన కేసులో భార్యకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరులోని 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి సుంకర శ్రీదేవి సోమవారం తీర్పునిచ్చారు. ఇన్‌చార్జ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పులికల్లు రవీంద్రనాథ రెడ్డి కథనం మేరకు.. పాలసముద్రం మండలం నరసింహాపురానికి చెందిన మునివేలుకు 12 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన గోవిందమ్మ(30)తో వివాహమైంది. వారికి ఆరో తరగతి చదివే కొడుకు ఉన్నాడు. 

వీరు వ్యవసాయ కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే గోవిందమ్మ ప్రవర్తనలో మార్పు రావడంతో పద్ధతి మార్చుకోవాలని మునివేలు పలుమార్లు హెచ్చరించాడు. పెద్దలు సర్ది చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. 2017 అక్టోబర్‌ 17వ తేదీన ఇంట్లో తన భర్త ఒక్కడే ఉండగా పుట్టింటి నుంచి వచ్చిన గోవిందమ్మ తినే అన్నంలో మత్తు మందు కలిపి మునివేలుకు వడ్డించింది.

 తరువాత నిద్రపోతున్న అతనిపై అర్ధరాత్రి సమయంలో కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. మంటలతోనే బయటకు పరుగెత్తుతున్న భర్తను ఆమె కర్రతో కొట్టి అడ్డుకునే ప్రయత్నం చేయగా, తప్పించుకుని కాలువలో దూకి మంటలు ఆర్పుకున్న మునివేలు జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పాడు. అతన్ని తమిళనాడులోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదే నెల 25వ తేదీ చనిపోయాడు. మృతుడి తల్లి మల్లిక ఇచ్చిన ఫిర్యాదుపై పాలసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో గోవిందమ్మకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement