గొడవ.. గ్యాంగ్ వార్
● పోలీసులను అడ్డుకున్న కాలనీ వాసులు
● కాలనీలో కార్టన్ సెర్చ్
● పట్టణంలో టెన్షన్
● రౌడీషీటర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్
పలమనేరు: ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగి గొడవ పెద్దది అయ్యి, గ్యాంగ్‌వార్‌కు దారి తీసిన సంఘటన మంగళవారం పలమనేరులో చోటు చేసుకుంది. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు సిబ్బందిని కొందరు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని ఎంఎన్‌ఆర్ కాలనీ విద్యార్థులు, పాతపేట విద్యార్థుల మధ్య కళాశాల వద్ద రెండు రోజుల కిందట చిన్నపాటి గొడవ జరిగింది. దీనిపై ఓ విద్యార్థి తనకు తెలిసిన గ్యాంగ్ ద్వారా మంగళవారం సాయంత్రం ఎంఎన్‌ఆర్ కాలనీ వద్ద బైక్‌లపై కాపుగాచి కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులను చితకబాదారు. దీంతో తమ పిల్లలపై దాడి చేస్తున్నారంటూ కాలనీ వాసుల ఏకమై వారిపై దాడికి దిగి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాతపేటకు చెందిన కొందరు స్టేషన్ వద్దకు వెళ్లి తమపై దాడి చేసి బైక్‌లను లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు ఎంఎన్‌ఆర్ కాలనీకి వెళ్లగా తమ పిల్లలపై దాడి చేసినవారు ఇక్కడికి వచ్చేదాకా కుదరదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెద్దసంఖ్యలో కాలనీ మహిళలు ఏకమై పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పలమనేరు, గంగవరం సీఐలు నరసింహరాజు, మురళీమోహన్, ప్రసాద్ సిబ్బందితో కలసి కాలనీకి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. మీ పిల్లలపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ మీరే చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఎంఎన్‌ఆర్ కాలనీ కార్టన్ సెర్చ్‌కు దిగారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో లభించిన గోతాన్ని సీజ్ చేశారు. అందులో ఏముందో తెలియలేదు. ఫలితంగా మదనపల్లి రోడ్డులో రెండు గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం వ్యవహారంపై వీడియోలు తీసిన పోలీసులు జరిగిన సంఘటనపై విచారిస్తున్నారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి విచారణ జరిగాక ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారో పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కాగా పట్టణంలో ఎంఎన్‌ఆర్ కాలనీ, పాతపేటకు చెందిన కొందరు యువకుల గ్యాంగ్‌ల కారణంగా పట్టణంలో శాంతిభద్రతల సమస్య నెలకొందనే విషయం ఇప్పటికే జిల్లా ఎస్పీకి పూర్తి సమాచారం వెళ్లిందని తెలిసింది. మొత్తం మీద ప్రశాంతతకు మారుపేరైన పలమనేరులో ఇటీవల ఆశాంతి నెలకొనడంపై పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇరువర్గాల పరస్పర దాడులు
గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా కళాశాలలో ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు, పలమనేరు పట్టణంలోని ఆర్‌వీఆర్ కాలనీ వాసులతో కలిసి పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటన మండలంలోని మదర్‌థెరిసా కళాశాల వద్ద మంగళవారం జరిగింది. కళాశాలలో విద్యార్థు ల మధ్య కొంత మనస్పర్థలు కారణంగా విబేధాలు ఏర్ప డి, రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం విద్యార్థులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు పలమనేరు పట్టణంలోని ఆర్‌వీఆర్ కాలనీలోని పోకిరీలను వెంట తీసుకెళ్లి మరో వర్గంపై దాడికి పాల్పడింది. అక్కడి నుంచి సాయిబాబా ఆలయం వద్ద అడ్డగించి అదే వర్గం విద్యార్థులపై మరోసారి దాడి చేశారు. ఆ తరువాత మరో వర్గం విద్యార్థులు పలు కళాశాలల్లో తమ స్నేహితులను పిలిపించి, అందరూ కలిసి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఇరువర్గాల విద్యార్థులకు సర్ది చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. ఆ తరువాత అందరూ కలిసి ఏకంగా కాలనీ వరకూ చేరుకుని దాడులకు పాల్పడడంతో అక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment