వెదురుకుప్పం : కోడెగిత్తల జోరు.. యువత హుషారు ... దూసుకుపోతున్న ఎడ్లను కట్టడి చేసే క్రమంలో యువత చూపిన ఉత్సాహం ఆ గ్రామంలో సందడి నెలకొంది. ఆదివారం మండలంలోని కొమరగుంట లో జరిగిన జల్లికట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయిన ఎడ్లు యువతను హోరెత్తించాయి. ఓ పక్క యువత కేరింతలు మరోపక్క ప్రజల అరుపులు, కేకలతో జల్లి కట్టు దుమ్మురేపింది. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఎడ్ల కొమ్ములకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, బెలూన్‌లు, పలకలు కట్టి బహుమతులతో సిద్ధం చేశారు. అప్పటికే యువత పెద్ద ఎత్తును గ్రామాలకు చేరుకుని బహుమతులు గెలుచుకునేందుకు అల్లి వద్ద నిలబడ్డారు. ఈక్రమంలో ఎడ్లను ముస్తాబు చేసి విడతల వారీగా పందానికి ఉసిగొల్పారు. దీంతో కోడెగిత్తలు రంకెలేసుకుంటూ పరుగులు తీశాయి. దూసుకుపోయిన ఎడ్లను నిలువరించి పలకలు పట్టేందుకు యువత ప్రయత్నం చేశారు. కొన్ని ఎడ్ల వేగాన్ని నిలువరించిన యువకులు పలకలను లాక్కొని ఆనందంతో మురిసిపోయారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఈ ప్రాంగణం కిక్కిరిసింది.