చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, దీంతో తమ భవిష్యత్ భారంగా మారిందని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలమనేరుకు చెందిన మునికుమార్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కేశారని మండిపడ్డారు. రాయలసీమకు సంబంధించి అనంతపురం ఒక్కచోటే కోచింగ్ సెంటర్ పెట్టడం దారుణమన్నారు. అంత దూరం వెళ్లి శిక్షణ పొందాలంటే కష్టతరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరులోనే శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే ధర్నా నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మద్దతు పలికారు. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే మహిళా అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కోచింగ్ కేంద్రాల ఎంపికలో అధికారులు పారదర్శక పాటించలేదని, ముడుపు ఇచ్చిన వారికే సెంటర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చిత్తూరుకు శిక్షణ కేంద్రం మంజూరు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థుల ధర్నా
చిత్తూరులో కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు డిమాండ్