బంగారుపాళెం : మండలంలోని పాలేరు సమీపంలో బుధవారం విద్యార్థులను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పాలేరు, పాలమాకులపల్లెకు చెందిన పలువురు విద్యార్థులు బంగారుపాళెంలోని ప్రభుత్వ పాఠశాల, తగ్గువారిపల్లెలోని భవిత పాఠశాల, స్థానిక చైతన్య పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తరువాత రోజూ వెళ్లే ఆటోలో 10 మంది విద్యార్థులు బంగారుపాళెం నుంచి ఆటోలో కొత్తపల్లె సర్వీసు రోడ్డు మీదుగా స్వగ్రామాలకు బయలుదేరారు.
పాలేరు అండర్ బ్రిడ్జికి కిలో మీటరు దూరంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడగా పాలమాకులపల్లెకు చెందిన ప్రకాష్ కుమారుడు యువతేజ, పాలేరుకు చెందిన జీవన్ కుమారై సౌమ్య, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు