● చిత్తూరులోని పోలీసు అధికారిపై డీఐజీ ఆరా ● విచారణ చేస్తామని ప్రకటించిన ఎస్పీ ● అవినీతి ఆరోపణలపై కానిస్టేబుళ్ల బదిలీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ఓ స్టేషన్‌ను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన అధికారిపై అనంతపురం డీఐజీ షీమోషీ ఆరా తీస్తున్నారు. ఓ చోరీ కేసులో దొంగ నుంచి రూ.12.50 లక్షల లంచం తీసుకోవడం, డబ్బులు తీసుకుని కేసులు నమోదు చేయకపోవడం, పోలీస్ బాస్ తన ప్యాకెట్లో ఉన్నారని ప్రగల్భాలు పలికి అవినీతి కార్యకలాపాలు చేస్తున్న పోలీసు అధికారిపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో మంగళవారం శ్రీకాసుక్కూర్చున్న ఖాకీశ్రీ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉన్న డీజీఐ షీమోషీ ఈ కథనంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. దొంగ నుంచి రూ.12.50 లక్షలు లంచం తీసుకున్నాడనే ఆరోపణలపై ఇప్పటికే విచారణ చేపట్టామని డీఐజీకు వివరించగా.. పత్రికలో వచ్చిన ఇతర ఆరోపణలపై కూడా విచారణ చేయాలని ఆమె ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ అధికారి చెప్పినట్లు చేసి, దొంగ నుంచి డబ్బులు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారనే అవినీతి ఆరోపణలపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లోని ముగ్గురు సిబ్బందిపై బదిలీ వేటు పడింది. వీళ్లను ఆ పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏకంగా పోలీస్ శ్రీబాస్‌శ్రీ పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న ఆ అధికారి వ్యవహార శైలిపై జిల్లా పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.