ఇంధనం గుట్టు..
పెట్రోల్‌లో నాణ్యతలో తేడా.. కొలతల్లో వ్యత్యాసం.. బంకుల్లో కనీస వసతులు లేమి..తదితర కారణాలతో వినియోగదారులు మోసపోతున్నారు. బంకు యజమానులు పెట్రోల్ పంపుల్లో సాంకేతి పరిజ్ఞానం, చిప్‌లను వినియోగించి నిలువునా దోచేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మోసాలు పట్టేదెలా అని సామాన్యులు చింతిస్తున్నారు.
చిత్తూరు అర్బన్: కొన్ని పెట్రోలు బంకుల్లో జరుగుతున్న మోసాలపై రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జరిమానాలతో వాటిని సరిచేయొద్దని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే పెట్రోలు బంకుల్లో అసలు ఏం జరుగుతోంది..? ఇక్కడ లభ్యమవుతున్న పెట్రోలు నాణ్యత పరిస్థితి..? వాహన చోదకులకు ఎలాంటి సౌకర్యాలు బంకుల వద్ద లభించాలి..? వీటిపై పర్య వేక్షణ పెట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు..? అనే విషయాలను తెలుసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా శ్రీసాక్షిశ్రీ బృందం పెట్రోలు బంకులను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
కల్తీ గుర్తించే వీల్లేదు..
పెట్రోలు నాణ్యతను నిర్ధారించేదే ఫిల్టర్ పేపర్ పరీక్ష. బంకుల నిర్వాహకుల వద్ద తప్పనిసరిగా ఫిల్టర్ పేపర్ ఉండాలి. నాణ్యతపై అనుమానం వస్తే..ఓ ఫిల్టర్ పేపర్ తీసుకుని దానిపై నాలుగు చుక్కల పెట్రోలు పోయాలి. నిమిషం తరువాత పేపర్‌పై ఎలాంటి మరక కనిపించకపోతే అది నాణ్యమైనది. ఏదైనా మరక ఏర్పడితే అందులో కల్తీ జరిగిందని గుర్తించాలి. పెనుమూరు, గంగాధరనెల్లూరు, వి.కోట, శాంతిపురం, గుడిపాల, యాదమరి, చిత్తూరులోని పలు పెట్రోలు బంకుల్లో ఫిల్టర్ పేపర్ లేదని చెబుతున్నారు. ఇలా జిల్లాలోని 67 పెట్రోలు బంకుల్లో అసలు ఫిల్టర్ పేపర్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల ఫిల్టర్ పేపర్ ఇస్తుంటే, మరికొన్ని చోట్ల ఉన్నా కూడా ఇవ్వడంలేదు. ఇక పెట్రోలు నాణ్యత తెలుసుకోవడానికి పెట్రోలు పోసే పంపులను గమనిస్తే.. పెట్రోలు 720–775, డీజిల్ 820–345 మధ్యలో ఉంటేనే అది నాణ్యమైనదిగా అర్థం. చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర, ఎంత పడుతున్నారనే విషయం తప్ప మరేమీ కనిపించడంలేదు. చిత్తూరు నగరంలోని హై రోడ్డులో ఉన్న బంకులో సాంద్రత రీడింగు ఏమాత్రం కనిపించడంలేదు. ఇదే బంకులో పెట్రోలు పరిమాణం తెలుసుకోవడానికి ఖాళీ బాటిల్‌లో పెట్రోలు నింపుకుని, వాటర్ బాటిల్ పరిమాణంతో తనిఖీ చేస్తే తేడా కనిపిస్తోంది. మీటరు రీడింగు సున్నా ఉన్నప్పటికీ ఒకేసారి రూ.4 జంప్ అవుతోంది.
వసతులు కనిపిస్తే ఒట్టు..
మరోవైపు వాహనాలకు ఉచిత గాలి నింపేందుకు బంకుల్లో పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. బంకులు కొత్తగా ఏర్పాటు చేసేప్పుడు కనిపించే ఈ పరికరాలు ఆపై తుప్పుపట్టి ఉంటున్నాయి. గాలి పట్టడానికి వెళితే పనిచేయడంలేదని సిబ్బంది చెబుతున్నారు. అత్యవసర వేళ కాలకృత్యం తీర్చుకోవడానికి వాష్‌రూమ్ తప్పనిసరిగా ఉండాలి. జిల్లాలోని 38 బంకుల్లో వాష్‌రూమ్‌లు లేవు. 42 బంకుల్లో వాష్‌రూమ్‌ల్లో నీళ్లు లేవని, రిపేర్లలో ఉన్నాయని నిర్వాహకులు లోపలకు వెళ్లనీయడంలేదు. ఎక్కువ పరిమాణంలో పెట్రోలును క్యాన్లలో నింపుకుంటున్న విక్రయదారులు, వాటిని పల్లెల్లోకి తీసుకెళ్లి.. కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారు.
అధికారులెక్కడ..?
పెట్రోలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేయాల్సిన పౌరసరఫరాల అధికారులు, తూనికలు–కొలతల శాఖ అధికారులు ఏమాత్రం వినియోగదారుల సమస్యలు పట్టించుకోవడంలేదు. చిత్తూరు నగరంలోని పుత్తూరు రోడ్డులో ఓ బంకులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చి, పెట్రోలు పరిమాణంలో భారీ తేడాలతో దోచుకుంటుంటే ఐదేళ్ల కిందట చేసిన తనిఖీలు తప్ప.. మరేవీ ప్రజలకు గుర్తులేదు. కొన్నిచోట్ల నిర్వాహకుల నుంచి నెలసరి మామూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలకు కుర్చీలు వేయడం, టీ–బిస్కెట్లు ఇవ్వడం లాంటి పనులకు వీళ్లను ఉపయోగించుకుంటున్న అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
జిల్లాలో పెట్రోలు బంకుల వివరాలు
పెట్రోలు బంకుల సంఖ్య: 170
పెట్రోలు అమ్మకాలు (నెలకు):
30 లక్షల లీటర్లు
డీజిల్ (నెలకు):
30.28 లక్షల లీటర్లు
లావాదేవీలు(నెలకు):
రూ.30.02 కోట్లు
ఫిల్టర్ పేపర్లు లేనివి: 67 బంకులు
వాష్‌రూమ్‌లు లేనివి: 38 బంకులు
వాష్‌రూమ్‌లు రిపేర్లు: 42 బంకులు
గాలి నింపే మిషన్లు రిపేర్లు: 89
ఏది అసలు.. ఏది కల్తీ తెలియని వైనం
నాణ్యత నిర్ధారణకు బంకుల్లో వస్తువుల్లేవు
వసతులు.. కనీస సౌకర్యాలు కనిపించవు
అధికారుల తనిఖీలు నామమాత్రమే
‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వాస్తవాలు
చర్యలు తప్పవు..
పెట్రోలు ఫిల్లింగ్ స్టేషన్లలో ఏటా తనిఖీలు చేసి, ఎక్కడైనా తేడాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే మాకు ఫిర్యాదు (ఫోన్–8008301423 )చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – శంకరన్, జిల్లా పౌరసరఫరాల వాఖ అధికారి, చిత్తూరు.
పట్టేదెట్టా?