
మూల్యాంకనం.. వేగవంతం
నిర్ణీత సమయం.. సిబ్బంది నియామకం.. ఏ ర్పాట్లు సిద్ధం.. వారంలో పూర్తి చేయాలన్న లక్ష్యం.. ఇందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తం.. త్వరితగతిన వెల్లడికానున్న పరీక్షల ఫలితం.. వెరసి పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతం కానుంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు చిత్తూరులోని పీసీఆర్ స్కూలు వేదికై ంది.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మూల్యాంకన ప్రక్రియకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వివిధ సబ్జెక్టుల టీచర్లు, హెచ్‌ఎంలు హాజరుకానున్నారు. ఈ ప్రక్రియకు డీఈఓ వరలక్ష్మి క్యాంప్ ఆఫీసర్‌గా, స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మరో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా పుత్తూరు డీవైఈఓ ప్రభాకర్‌రాజు వ్యవహరించనున్నారు. వివిధ జిల్లాల నుంచి మూల్యాంకన కేంద్రానికి వచ్చిన జవాబుపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూల్యాంకనానికి 1,244 మంది నియామకం
పదో తరగతి జవాబుపత్రాలను మూల్యాంకనం చేసేందుకు 1,244 మందిని నియమించారు. మూల్యాంకనానికి చీఫ్ ఎగ్జామినర్ (సీఈ) 130, అసిస్టెంట్ ఎగ్జామినర్ (ఏఈ) 744, స్పెషల్ అసిస్టెంట్లు 370 మందిని మూల్యాంకన విధులకు కేటాయించారు. వారందరికీ ఐడెంటీ కార్డులు ఇవ్వనున్నారు. విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డులను వేసుకోవాలని ఆదేశాలిచ్చారు. మూల్యాంకన కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించనున్నారు. విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొదటి రోజు మూల్యాంకన కేంద్రంలో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపారు. గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. జిల్లాకు వచ్చిన 2 లక్షల జవాబుపత్రాలను దిద్దనున్నారు. తొలుత ప్రతి ఉపాధ్యాయుడికి 40 పేపర్లు ఇస్తారు. నిర్ధేశిత వ్యవధిలో దిద్దితే మరో 10 పేపర్లు ఇస్తారు.
ఓపెన్ పరీక్షల మూల్యాంకనం నేటి నుంచే..
ఓపెన్ స్కూల్ పరీక్షల ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం సైతం గురువారం నుంచే ప్రారంభం కానుంది. ఇందుకు పీసీఆర్ జూనియర్ కళాశాలలోని కొన్ని గదులను కేటాయించారు. ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు జరగనుంది. జిల్లాకు వచ్చిన 18 వేల ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పేపర్లను దిద్దనున్నారు.
నేటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం
పీసీఆర్ పాఠశాలలో పకడ్బందీ ఏర్పాట్లు
వారం రోజులు సాగనున్న ప్రక్రియ
నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటన
ఏడు రోజుల్లోనే పది మూల్యాంకనం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలను మూల్యాంకన కేంద్రంగా గుర్తించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు జవాబుపత్రాల మూ ల్యాంకనం నిర్వహించనున్నారు. ఈ మేరకు మూ ల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లను డీఈఓ వరలక్ష్మి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు.
ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందే
మూల్యాంకన విధులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందే. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు. నిబంధనల ప్రకారం మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మూల్యాంకనం నిర్వహించే సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించేందుకు వీల్లేదు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో మూల్యాంకనం విధులను నిర్వహించాలి. పీసీఆర్ పాఠశాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు

మూల్యాంకనం.. వేగవంతం