
‘గల్లా’ స్వీయ చరిత్రపై వెబ్ సిరీస్
● మహిళలకు స్ఫూర్తిగా స్వీయ చరిత్ర పుస్తకం
● ప్రముఖ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయేంద్ర ప్రసాద్
తవణంపల్లె : కల్మషం..అబద్ధం లేకుండా మహిళలకు స్పూర్తిదాయకంగా ముద్రించిన గల్లా ‘అరుణకుమారి స్వీయ చరిత్ర’లోని కొన్ని అద్భుతమైన అంశాలు ద్వారా వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆదివారం మండలంలోని దిగువ మాఘంలోని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగృహానికి విచ్చేశారు. ఆయనకు మాజీ మంత్రి అరుణకుమారి, అమరరాజ బ్యాటరీస్ అధినేత రామచంద్రనాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తండ్రికి మంచి కుమార్తెగా.. భర్తకు మంచి భార్యగా, తన పిల్లలకు మంచి తల్లిగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజలకు సేవలు అందించే నాయకురాలుగా ఎదిగిన అరుణమ్మ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె సమ్మతిస్తే మంచి సినిమా, వెబ్‌సిరీస్ తీయవచ్చునని అభిప్రాయపడ్డారు. సినీ హీరో గల్లా అశోక్‌కు మంచి కథ రాసి హిట్ చేయించి సినిమా రంగంలో రాణించేలా చూడాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో స్థానికులు, సర్పంచ్ గోపి పాల్గొన్నారు.