
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
చౌడేపల్లె : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చౌడేపల్లె మండలంలోని గోసలకురప్పల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజ , నాగమ్మలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందగా తల్లి నాగమ్మ, అక్క మంజులతో కలిసి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వై.లక్ష్మి(34) నివసిస్తున్నారు. చౌడేపల్లె సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మి ఇటీవల బదిలీల్లో భాగంగా గుడిపల్లె పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. లక్ష్మి భర్త హరి ప్రసాద్ పలమనేరులోని ఓ ప్రవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. మృతురాలి తల్లి నాగమ్మ, అక్క మంజులతో పాటు కలిసి ఇంట్లో మాట్లాడుతుండగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన అక్క కుమార్తెతో భర్త సరిగా మాట్లాడలేదని ఎందుకని ప్రశ్నిస్తూ భర్తను కానిస్టేబుల్ లక్ష్మి నిలదీసిందన్నారు. భర్త కుటుంబ సభ్యుల ముందు సమాధానం చెప్పకపోవడంతో కోపంతో హాలులో నుంచి బెడ్ రూములోకి లక్ష్మి కోపంగా వెళ్లి తలుపు గడియ పెట్టుకొందని, ఈక్రమంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. లక్ష్మి మృతితో గోసలకుర్పల్లెలో శోక సంద్రంగా మారింది.