
ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలు
● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ● కౌన్సిలర్లను అంగడి సరుకులా కొనేందుకు యత్నం ● ఒకరిద్దరు టీడీపీకి మద్దతు తెలిపే అవకాశం ● పార్టీలు మారే కౌన్సిలర్లు తమకొద్దంటున్న ప్రజానీకం ● ఓటింగ్‌కు అడ్డుపడే అవకాశం ఉండడంతో రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ● కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నికను తలపించనుందా..?
కుప్పం రూరల్: సంఖ్యా బలం లేకపోయినా ఎలాగైనా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరి దక్కించుకోవాలని అధికార టీడీపీ బరితెగింపులకు పాల్పడుతోంది. ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను అంగడి సరుకుల్లా కొనేందుకు బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు లొంగని పక్షంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను సమావేశానికి రానివ్వకుండా అడ్డుకుని, ప్రత్యేక జీఓల ద్వారా అడ్డదారుల్లో గెలిచే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ఆలోచనలు పసిగట్టిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యం గెలుస్తుందా..? అధికార పార్టీ కుతంత్రాలు గెలుస్తాయా? అనేది కుప్పం జనంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పార్టీ ఫిరాయింపులు మంచిది కాదు
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఒకరిద్దరు వైఎస్సార్ సీపీ వారు టీడీపీకి మద్దతు ఇస్తారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఫార్టీ ఫిర్యాయిస్తారనే కౌన్సిలర్ల పరిధిలోని ప్రజలు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. తాము మంచి చేస్తారని ఓట్లు గెలిపిస్తే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తే వారికి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు.
మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా?
కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా? అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. గత నెలలో రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కోరం లేకపోయినా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. మండలంలో 16 ఎంపీటీసీ సభ్యులుండగా, ఎంపీపీ అభ్యర్థి శాంతకుమారి అకాలమరణం పొందింది. దీంతో సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎన్నిక నిర్వహించాలంటే కోరం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎన్నికలకు హాజరు కాకుండా అడుగడుగునా అడ్డుకుని, హాజరైన ఆరుగురు టీడీపీ సభ్యులతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులే గెలిచినట్లు అధికారులు ప్రత్యేక జీఓ అనే అస్త్రాన్ని ఉపయోగించుకుని గెలుపును నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
అధికార పార్టీ నుంచి తమకు ఇబ్బందులున్నాయని, రక్షణ కల్పించాలని కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సభ్యులకు రక్షణ కల్పించాలని కోర్టు జిల్లా, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. కౌన్సిలర్లు ప్రయాణించే వాహనాల నంబర్లు, ఆధార్‌కార్డులు పోలీసులకు అందజేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఇందుకు సంబంధించి పత్రాలు అందజేశారు.
సర్వత్రా ఉత్కంఠ
కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా చైర్మన్ ఎన్నికపైనే చర్చలు సాగుతున్నా యి. టీ షాపులు వద్ద నలుగురు గుమికూడిన ప్రతి చోట చైర్మన్ అభ్యర్థిత్వంపైనే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరు ఒకరికి వస్తుందని, లేదు లేదు మరోకరికి వస్తుందనే వాదనలు నడుమ మాటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సోమవారం ఏ పార్టీ వారికి మంచి రోజు అవుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
షీల్డు కవరే శరణ్యమా?
చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా సాగితే వైఎస్సా ర్ సీపీ గెలుపు ఖాయం. వైఎస్సార్ సీపీలో ఇప్పటికే చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం స్పష్టమైన నిర్ణ యం తీసుకుంది. చిక్కల్లా టీడీపీలోనే ఉంది. అడ్డదారుల్లో టీడీపీ చైర్మన్ గిరి దక్కించుకుంటే అభ్యర్థి విషయంలో స్పష్టత లేదు. ఎవరికి వారు తామే చైర్మన్ అ ని ప్రచారాలు చేసుకుంటున్నారు. 19 వార్డు కౌన్సిలర్ దాము తనకే దక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా డు. 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్ అయితే అధిష్టానం ఆశీర్వాదం తనకే ఉందని దీమాగా ఉన్నాడు. 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం కుప్పంలో 60 శాతం ఓ టర్లు తమ సామాజిక వర్గం వారే ఉన్నారని, తనకు ఇస్తేనే సముచితమని, ఇప్పటికే పలుసార్లు మద్దతు కోసం సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించారు. మరో వ్యక్తి కూడా చైర్మన్ గిరిపై ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. నలుగురైదుగురు పోటీ ఉన్న నేపథ్యంలో నిర్ణయం అధిష్టానానికి వదిలే స్తారనే వాదన లేకపోలేదు. పైనుంచి వచ్చే షీల్డు కవర్‌లో ఎవరు పేరు ఉంటే వారే చైర్మన్ అన్న అభిప్రాయం లేకపోలేదు.

ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలు