
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పలమనేరు: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఉదయం 10 గంటల నుంచే కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో నిండిపోయింది. రీసర్వే, భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వచ్చాయి. సమస్యలను శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, జేసీ విధ్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్, పలమనేరు ఆర్డీఓ భవానీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపాడల్ అర్జీలు స్వీకరించారు.
మొత్తం 436 సమస్యలు
గ్రీవెన్స్‌డేకి మొత్తం 436 వినతులందాయి. వీటిలో భూ ఆక్రమణలు 71, ఆర్‌ఓఆర్ 53, పట్టాదారు పాసు పుస్తకాలు 41, అసెన్‌మైంట్లు 14, ముటేషన్లు 10, దారి సమస్యలు 20, సామాజిక పింఛన్లు 39 అర్జీలు అందాయి. మిగిలివన్నీ పలు శాఖలు, వ్యక్తిగత సమస్యలే ఉన్నాయి.
కొందరి సమస్యలివీ..
పెద్దపంజాణి మండలం పెనుగొలకలకు చెందిన గుర్రమ్మ తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరింది.
పలమనేరు మున్సిపాలిటీకి చెందిన చెంగమ్మ(75) వృధ్యాప్య పింఛన్ కోసం పలుమార్లు అర్జీలిచ్చిన ఎవరూ పట్టించుకోలేదని విన్నవించింది.
స్థానిక 17వార్డు ఏప్రిల్ నెల కోటా రేషన్ ఇవ్వలేదని పలువరు మహిళలు అర్జీ ఇచ్చారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు.
రీసర్వేలో పట్టాభూమి డీకేటీగా నమోదు చేశారని సమస్యను పరిష్కరించాలని తొమ్మిదినెలలుగా గంగవరం రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదని గంగవరం మండలం పత్తికొండకు చెందిన మంజునాథ్ తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోపు సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పలమనేరులోని గాంధీనగర్ నుంచి గంటావూరుకు వెళ్లే మెయిన్‌రోడ్డు ఆక్రమణలకు గురైందని పట్టణానికి చెందిన వెంకట రెడ్డిప్రసాద్ అర్జీ ఇచ్చారు. దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కరెంట్ షాక్ కొట్టడంతో వెన్నుముఖ దెబ్బతిని సగం శరీరం స్పర్శ లేకుండాపోయిందని సదరంలో 91శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చినా వికలాంగ పింఛను రాలేదని ఓ ట్రాన్స్‌కోలో పనిచేసే కూలి తెలిపారు.
ఎక్స్‌ప్రెస్‌హైవేకు భూములిచ్చినా ఇంకా అవార్డు పాసు చేయలేదని వి.కోట మండలం తోటకనుమకు చెందిన నవమోహన్‌రెడ్డి అర్జీ ఇచ్చారు.
ఎస్సీలమైన తమ ఇంటిస్థలాల్లోకి రానీయకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారని జగమర్ల వాసులు విన్నవించారు.
పలమనేరు నుంచి ఉదయం 4నుంచి 6 దాకా చిత్తూరు వైపు బస్సులేవని దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా చెప్పించినా ఆర్టీసీ నిర్లక్ష్యం చూపుతోందని పలమనేరు పరిరక్షణ సమితి నిర్వాహకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రవికుమార్‌నాయుడు, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, డీపీఓ సుధాకర్‌రావు పాల్గొన్నారు.