నెల్లూరు సిటీ: ‘అమ్మా.. సారీ నేను చదవలేకపోతున్నాను.. నేను బతికినా ఒకటే.. చచ్చినా ఒకటే’ అంటూ పదో తరగతి విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం ఆర్‌ఆర్ కాలనీలో దువ్వూరు హరనాథ్‌రెడ్డి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పనత్‌రెడ్డి (15) ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చదువుల్లో కొంత వెనుకబడ్డాడు.
ఇంట్లో ఉంటే ఆటల్లో పడి పుస్తకాలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని, హాస్టల్లో చేర్చితే సహచర విద్యార్థులతో కలిసి మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఎనిమిదో తరగతిలోనే హాస్టల్లో చేర్పించారు. చదువు విషయంలో పనత్‌పై ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, పాస్ మార్కులు వస్తే చాలని అక్కడి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పనత్‌రెడ్డికి ఒక పక్క పాఠాలు అర్థం కాక, తల్లిదండ్రులకు చెబితే తిడతారని భయపడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే చదువు కొనసాగించాడు.
మంచి మార్కులు రావడం లేదన్న ఆందోళన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక పనత్‌రెడ్డి నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వారు కిందకు దించి అతడిని చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే పనత్‌రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటావుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పనత్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
పాఠశాల ఎదుట ఆందోళన
పనత్‌రెడ్డి మృతిపై విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడితోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment