తొలిసారి అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టాం
టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి
బయటి రాష్ట్రాల్లో ఆపరేషన్స్‌కు స్పెషల్ టీం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీలు చేసేందుకు తమ బ్యాంకు ఖాతాలను కమీషన్ల కోసం ఇస్తున్న (మ్యూల్ బ్యాంక్ ఖాతాలు) 27 మంది నిందితులను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.
టీజీసీఎస్‌బీ అధికారులు తొలి సారిగా చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా ఈ నిందితులను రాజ స్తాన్‌లోని 3 ప్రాంతాల్లో అరెస్టు చేసినట్టు బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీజీసీఎస్‌బీ ఎస్పీ దేవేందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు.
తెలంగాణలో 189 సైబర్ నేరాలతో వీరికి సంబంధం..
‘అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మొదటిసారిగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. రాజస్తాన్‌లోని జైపూర్, జోథ్‌పూర్, నాగ్‌పూర్‌లలో 15 రోజులపాటు చేసిన ఈ ఆపరేషన్‌లో 27 మందిని అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా జరిగిన 2,223 సైబర్ నేరాలలో వీరు నిందితులుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 189 సైబర్ నేరాల్లో వీరికి సంబంధం ఉంది. పట్టుబడిన వారిలో నిరుద్యోగులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారాలు చేస్తున్నవారు..ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు. నిందితులు అందరూ విద్యావంతులే.
వీరంతా 29 మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 11.01 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు చేసినట్టు గుర్తించాం. తెలంగాణకు సంబంధించిన 189 కేసులలో కొల్లగొట్టిన రూ.9 కోట్లు వీరి బ్యాంకు ఖాతాల ద్వారానే పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఈ బ్యాంకు ఖాతాలను వినియోగించి చేసిన మోసాలలో ప్రధానంగా వ్యాపార పెట్టుబడులు, ట్రేడింగ్‌తోపాటు డిజిటల్ అరెస్టు వంటి నేరాలు ఉన్నాయి’ అని శిఖాగోయల్ వెల్లడించారు.
సైబర్ మోసగాళ్ల పనిపట్టేందుకు టీజీ సీఎస్‌బీ ఆధ్వర్యంలో ఇకపైన కూడా అంతర్రాష్ట్ర ఆపరేషన్లు కొనసాగుతాయని, ఇందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టుబడిన 27 మంది వద్ద నుంచి 31 మొబైల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక విషయాలు తెలుస్తాయన్నారు.
కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని ప్రజలను శిఖాగోయల్ హెచ్చరించారు. కాగా, స్పెషల్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఫణీందర్, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు రమేశ్, ఆశిష్‌రెడ్డి, రవికుమార్, శ్రీను నాయక్, సునీల్, ఇతర సిబ్బందిని శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment