ఫోన్లు కొని ముఠాకు చేరవేస్తున్న ముగ్గురి అరెస్టు
నాలుగు వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం
పాత ఫోన్లు అపరిచితులకు అమ్మితే ముప్పే: టీజీ సీఎస్‌బీ
సాక్షి, హైదరాబాద్: డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బిహార్‌లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్‌తార, దియోగఢ్‌లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్‌కు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలామ్, మహ్మద్ ఇఫ్తికర్‌గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ 66 డీ, బీఎన్‌ఎస్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇలా చిక్కారు..
బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయి.
గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్‌లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు మొబైల్ ఫోన్ పాత యజమాని డివైస్ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment