బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్‌ సొసైటీ’ | Amaravati Capital Society cheated its Depositors | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్‌ సొసైటీ’

Published Sat, Mar 13 2021 4:40 AM | Last Updated on Sat, Mar 13 2021 2:47 PM

Amaravati Capital‌ Society cheated its Depositors - Sakshi

సాక్షి, అమరావతి: ‘అమరావతి కేపిటల్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌’ బోర్డు తిప్పేసింది. అవసరానికి అక్కరకొస్తుందనే ఆశతో పైసా పైసా కూడబెట్టి ఈ సొసైటీలో డబ్బు దాచుకున్న డిపాజిటర్లను ఆ సంస్థ నిలువునా ముంచేసింది. రెండు రోజులుగా నూజివీడులోని సొసైటీ కార్యాలయం తెరవకపోగా, డిపాజిట్‌ దారుల నుంచి డబ్బు వసూలు చేసిన ఏజెంట్లు ఎవరూ రావట్లేదు. దీంతో ఆందోళనకు గురైన డిపాజిట్‌దారులు శుక్రవారం సొసైటీ వద్దకెళ్లారు. అక్కడెవరూ లేకపోవడంతో సొసైటీ కార్యాలయానికి తాళాలేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుకు మొరపెట్టుకోవడంతో సొసైటీ దగా వ్యవహారం వెలుగుచూసింది. 

2018 నుంచి వసూళ్లు..
విజయవాడ కేంద్రంగా 2018లో ఏర్పాటైన అమరావతి కేపిటల్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, నెలవారీ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు సేకరించింది. ఆ మొత్తాలను గోల్డ్‌లోన్, బిజినెస్‌ లోన్, ఎడ్యుకేషన్‌ లోన్‌ పేరుతో వడ్డీలకిచ్చింది. మరోవైపు నూజివీడులో చిరు వ్యాపారుల నుంచి ఏజెంట్లు డైలీ కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. ఓ చిరు వ్యాపారి నెలకు రూ.3వేలు చొప్పున 12 నెలలకు రూ.36 వేలు కట్టే స్కీములో చేరితే అతను 6 నెలలు కట్టిన రూ.18 వేలతోపాటు మరో రూ.18వేల సొమ్మును కలిపి మొత్తం రూ.36 వేలు లోనుగా ఇస్తామని ఏజెంట్లు నమ్మబలికారు.

దీంతో నూజివీడు, విస్సన్నపేట, హనుమాన్‌ జంక్షన్, తిరువూరు ప్రాంతాల్లో సుమారు 500 మందికిపైగా డిపాజిట్‌దారులు అమరావతి సొసైటీలో సొమ్ము జమ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నూజివీడు, తిరుపూరు ప్రాంతాల్లోనే రూ.50 లక్షల వరకు డిపాజిట్లు సేకరించినట్టు సమాచారం. అయితే గడిచిన కొద్దిరోజులుగా గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో యాజమాన్యం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఒక్క నూజివీడులోనే 35 మంది ఖాతాదారులకు గడువు ముగిసిన డిపాజిట్లకు సంబంధించి రూ.20 లక్షల వరకు సొమ్ము తిరిగి చెల్లించాల్సి ఉందంటున్నారు. 

బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును కోరారు. ఈ నేపథ్యంలో డిపాజిట్‌దారులైన భవానీశంకర్, రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిల తదితరుల నుంచి నూజివీడు పట్టణ ఎస్‌ఐ గణేష్‌కుమార్‌ వివరాలు సేకరించారు.

విచారణకు ఆదేశించా: కృష్ణా జిల్లా ఎస్పీ
దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారించి కేసు నమోదు చేయాలని నూజివీడు, తిరువూరు పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. నూజివీడుకు చెందిన వి.దుర్గాలక్ష్మీభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి కేపిటల్‌ బ్యాంకుపై ఛీటింగ్‌ కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ బి.శ్రీనివాస్‌ చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement