ఓ విలేకరి, టీడీపీ నాయకులపై భర్త ఫిర్యాదు
వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కక్ష సాధింపు
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్‌వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంగన్‌వాడీల నిరసన..
అంగన్‌వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్‌వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన
ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదు
సామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్‌ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment