వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, చిత్రంలో నిందితులు
కొవ్వూరు/ద్వారకా తిరుమల: ఆస్తి కోసం అయినవాళ్లే హంతకులయ్యారు. కిరాతకంగా హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి కేసు వివరాలను డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. చిన్నాయిగూడెంకు చెందిన గెడ భాస్కరరావు (60) అనే వ్యక్తి ఈనెల 8వ తేదీ నుంచి కనిపించకపోవడంతో 10వ తేదీన పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. భాస్కరరావును అతని పొలంలోనే హతమార్చినట్టు పోలీసులు గు ర్తించారు. మృతుడు భాస్కరరావు, లక్ష్మీకాంతం దంపతులకు సంతానం లేకపోవడంతో శ్వేత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు వివాహం చేసి పదెకరాలు పొలం రాసిచ్చారు.
2016లో భార్య లక్ష్మీకాంతం మృతిచెందడంతో భాస్కరరావు మంచిచెడ్డలను శ్వేత, ఆమె సోదరుడు కిరణ్, వాళ్ల తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భాస్కరరావు తన ఆస్తిలో మరో ఎనిమిదెకరాలు కిరణ్‌కు రాసిచ్చారు. అనంతర కాలంలో అతడి బాగోగులను శ్వేత, కిరణ్ పట్టించుకోకపోవడంతో శ్వేత దత్తతను, కిరణ్‌కు ఇచ్చిన పొలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భాస్కరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి సోదరుడు సత్యనారాయణ, అతని భార్య రాధాకృష్ణవేణి భాస్కరరావు బాగోగులు చూసుకుంటున్నారు. భాస్కరరావు వద్ద మిగిలిన పదెకరాలను తన ఇద్దరు కూతుళ్ల పేరున రాయాలని కృష్ణవేణి, ఆమె తమ్ముడు గన్నిన శ్రీహరి ఒత్తిడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా భాస్కరరావు తాళ్లపూడి మండలం పోచ వరం గ్రామానికి చెందిన మహిళను ఈనెల 14న వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వివాహం జరిగితే తమకు ఆస్తి దక్కదని భావించిన రాధాకృష్ణవేణి భాస్కరరావుని హతమార్చాలని నిర్ణయించుకుంది. భాస్కరరావును చంపితే రెండెకరాల పొలం ఇస్తానని బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన తమ్ముడు గన్నిన శ్రీహరితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు భాస్కరరావు పొలం వెళ్లగా శ్రీహరి చంపేశాడు. అదేరోజు రాత్రి వరుసకు అల్లుడు అయిన బుట్టాయగూడెం మండలం కంసాలిగుంటకు చెందిన కంగల రమేష్ అనే యువకుడి సాయంతో భాస్కరరావు శరీరంపై పెట్రోల్ పోసి తగులపెట్టి అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.
ప్రమాదంగా చిత్రీకరిస్తూ..
హత్య నుంచి బయటపడేందుకు భాస్కరరావు మోటారు సైకిల్‌ను ధుమంతునిగూడెం–పల్లంట్ల రోడ్డులో పోలవరం కుడికాలువలో పడవేశారు. ప్రమాదవశాత్తు భాస్కరరావు కాలువలోకి దూసుకెళ్లి గల్లంతైనట్టు చిత్రీకరించారు. అయితే భాస్కరరావు అదృశ్యంపై అనుమానం వచ్చిన బంధువు గెడ రామనరసింహారావు పొలానికి వెళ్లి చూడగా మృతదేహం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో దేవరపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ట్రైనీ డీఎస్పీ వై.శృతి ఆధ్వర్యంలో ప్రధాన నిందితుడు శ్రీహరితో పాటు రమేష్, రాధాకృష్ణవేణిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం కాలువలో పడిఉన్న∙మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. కేసుకు సహకరించిన సీఐ ఎం.సురేష్, ఎస్సై కె.స్వామిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment