కర్నూలు: కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్‌నగర్‌లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్‌స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు.
1999లో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్‌లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే..
కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో జి+2 ఇల్లు, అశోక్ నగర్‌లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్‌లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్‌లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు.
డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్‌లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.
పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment