బెంగళూరులో చిక్కిన నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఆ నలుగురూ ఇంజనీరింగ్ డ్రాపౌట్స్... తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొత్త ఎత్తులు వేశారు... కోవిడ్ ఎఫెక్ట్‌తో తెరపైకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అనువుగా మార్చుకున్నారు. నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో భారీగా ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. ఆపై సెకండ్ హ్యాండ్ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఐటీ హబ్స్‌నే టార్గెట్‌గా చేసుకున్న ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు బెంగళూర్‌లోనూ నేరాలు చేసింది. వీరి గుట్టురట్టు చేసిన అక్కడి బైపనహల్లి పోలీసులు ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు. వీళ్లలో ఓ నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. బెంగళూర్‌లోని కమ్మనహల్లి ప్రాంతానికి చెందిన సైఫ్ పాషా ఈ ముఠాకు సూత్రధారి. అక్కడి వీరప్పనపాల్య, హెన్నూర్ బాండే వాసులైన మొయినుద్దీన్ ఖురేషీ, ప్రతీక్ నాగర్కర్, అశ్వఖ్‌లతో ముఠా కట్టాడు. ఈ నలుగురూ ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే మానేశారు. కొన్నాళ్ల క్రితం చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అవి నష్టాలనే మిగల్చడంతో డబ్బు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. కరోనా ప్రభావంతో ల్యాప్‌టాప్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ల్యాప్‌టాప్‌లను అద్దెకు ఇచ్చే సంస్థలు పోటీ పడి మరీ అద్దెకివ్వడం ప్రారంభించాయి.
వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేసి...
ఇది చూసిన సైఫ్‌కు కొత్త ఆలోచన వచ్చింది. బెంగళూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని గ్రహించి రెండుచోట్లా వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేశాడు. ముందుగా వీరు రెండుమూడు నకిలీ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో లెటర్‌హెడ్‌లు తదితరాలు రూపొందించారు. వీటి సాయంతో పలు సంస్థల నుంచి ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చే వారికి అడ్వాన్స్‌గా పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని ఇచ్చారు. ఇలా తమకు చిక్కిన ల్యాప్‌టాప్‌లను సైఫ్ నేతృత్వంలోని ముఠా సభ్యులు ఆన్‌లైన్‌లో విక్రయించడం మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో తమ సాఫ్ట్‌వేర్ కంపెనీని మూసేస్తున్నామని.. ల్యాప్‌టాప్‌లను సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతున్నామని ప్రచారం చేసుకున్నారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన ల్యాప్‌టాప్ సంస్థలు బెంగళూర్‌లోని మదివాల, సంపిగహెల్లీ, అశోక్‌నగర్, ఆర్టీ నగర్, మరథహల్లీ, జేపీ నగర్‌లతో పాటు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాకు చెందిన కొందరిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు సూత్రధారి సైఫ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోపక్క ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న బెంగళూర్‌లోని బైపనహెల్లీ పోలీసులు సోమవారం సైఫ్‌తో పాటు మొయినుద్దీన్, ప్రతీక్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 97 ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు బెంగళూర్ చేరుకుని సైఫ్‌ను తమ కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. పరారీలో ఉన్న అశ్వఖ్ కోసం గాలిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ ముఠా అరెస్టును ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment