చెంచు మహిళపై అమానుష దాడి | Brutal attack on Chenchu ​​woman | Sakshi
Sakshi News home page

చెంచు మహిళపై అమానుష దాడి

Published Fri, Jun 21 2024 4:44 AM | Last Updated on Fri, Jun 21 2024 4:44 AM

Brutal attack on Chenchu ​​woman

వివస్త్రను చేసి ఒంటిపై కారం చల్లిన ఇద్దరు  

డీజిల్‌ మంటతో ఒంటిపై విచక్షణారహితంగా వాతలు

నలుగురిపై కేసు నమోదు   

సాక్షి, నాగర్‌కర్నూల్‌: చెంచు మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు దంపతులు కాట్రాజు ఈశ్వరమ్మ–ఈదన్నలకు గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్‌ ఈ భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయ పనులతోపాటు సమీపంలోని ఇసుక ఫిల్టర్‌ వద్ద పనినిమిత్తం ఈశ్వరమ్మ–ఈదన్న దంపతులు వెంకటేశ్‌ వద్ద జీతం ఉంటున్నారు. వారం రోజుల కిందట ఈశ్వరమ్మ భర్తతో గొడవపడింది. 

ఆ తర్వాత మండల పరిధివలోని చుక్కాయిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 18వ తేదీన ఈశ్వరమ్మ కోసం బండి వెంకటేశ్‌ తన సోదరుడితో కలసి బైక్‌పై చుక్కాయిపల్లికి వెళ్లాడు. ఆమెను అదే బైక్‌పై మొలచింతలపల్లికి తీసుకొచ్చేందుకు తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యలో ఎల్లూరు శివారులో బైక్‌ ఆపాడు. పనులు ఎగ్గొట్టి పారిపోతావా అని ఆగ్రహిస్తూ ఈశ్వరమ్మను బైక్‌ నుంచి దింపాడు. అనంతరం కర్రతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. 

ఇంటికి తీసుకొ చ్చిన తర్వాత కూడా ఆమెను వివస్త్రను చేసి కారంతో కాళ్లలో, సున్నిత అవయవాల(జననాంగాలు)పై దాడి చేశారు. కర్రకు ఓ వ్రస్తాన్ని చుట్టి డీజిల్‌తో మంట పెట్టి ఒంటిపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. మరుసటి రోజు ఉదయం బడి పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ కోసం ఆదివాసీ లిటరిటీ కౌన్సిల్‌(ఎన్‌ఏఎస్‌సీ) ప్రతినిధులు ఆ గ్రామానికి వచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వ చ్చి0ది. బుధవారం సాయంత్రం ఏఎస్పీ రామేశ్వర్‌ను కలసి వారు ఫిర్యాదు చేశారు.

కొందరు తమ భూములను కూడా బలవంతంగా తీసుకోవడంతో పాటు ఇలా దాడులు చేస్తున్నారని, ఈశ్వరమ్మపై జరిగిన దాడి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని చెంచుసంఘం నాయకులు వాపోయారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బండి వెంకటే‹Ù, ఆయన భార్య శివమ్మ, లింగస్వామి, లక్ష్మి దాడి చేసినట్టు తేలిందని, వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కాగా బాధితురాలు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

బాధితురాలికి అండగా ఉంటాం: జూపల్లి  
చెంచు మహిళపై జరిగిన అమానుష దాడి పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌కు ఫోన్‌ చేసి కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులపై వెంటనే విచారణ చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement