గిఫ్ట్‌‌ పేరుతో రూ. 6.3 లక్షలు స్వాహా | Cheated On Cyber Criminal Woman In Name Of Friendship | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌‌ పేరుతో రూ. 6.3 లక్షలు స్వాహా

Published Fri, Sep 18 2020 10:02 AM | Last Updated on Fri, Sep 18 2020 10:03 AM

Cheated On Cyber Criminal Woman In Name Of Friendship - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళకు వాట్సాప్‌ ద్వారా పరిచయమైన సైబర్‌ నేరగాడు స్నేహం పేరుతో ఎర వేశాడు. ఆపై ఓ గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ చెప్పి రూ. 6.3లక్షలు కాజేశాడు. బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పాతబస్తీకి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వాట్సాప్‌ ద్వారా హాయ్‌ అంటూ సందేశం వచ్చింది. ఈమె స్పందించడంతో తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని, అమెరికాలో ఉంటున్నానని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. ఒంటరినైన తాను ఇప్పుడు వచ్చి కలవలేనంటూ చెప్పిన అతగాడు స్నేహానికి గుర్తుగా ఓ గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ చెప్పాడు. ఆమె అంగీకరించడంతో కొన్ని ఆభరణాలు, ల్యాప్‌టాప్‌ తదితరాల ఫొటోలు పంపాడు. (దేవికారాణి నగలపై ఈడీ ఆరా!)

ఆపై ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులం అంటూ బాధితురాలికి కొందరు ఫోన్లు చేశారు. అమెరికా నుంచి ఖరీదైన గిఫ్ట్‌ పార్శిల్‌ వచ్చిందని, అది పంపాలంటే కొన్ని పన్నులు కట్టాలంటూ చెప్పి దఫదఫాలుగా రూ. 6.3 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకుని మోసం చేశారు. మరో ఉదంతంలో అంబర్‌పేట ప్రాంతానికి చెందిన బాధితుడి ఏటీఎం కార్డును క్లోన్‌ చేసిన నేరగాళ్లు ఢిల్లీలోని ఏటీఎం కేంద్రం నుంచి రూ. 50 వేలు డ్రా చేయడంతో కేసు నమోదైంది. గురువారం మరో ‘పోలీసు బాధితుడు’ బయటకు వచ్చాడు. నగరానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ పేరు, ఫొటో, వివరాలతో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచిన సైబర్‌ నేరగాడు ఆయన ఫ్రెండ్స్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు. ఆపై వారితో చాటింగ్‌ చేస్తూ అత్యవసరమంటూ డబ్బు అభ్యర్థిస్తున్నాడు. దీంతో ఆయన సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement