సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్‌ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు.
నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్‌పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు.
నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్‌హాల్‌లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.
చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్‌చల్.. యువకుడిపై 15 మంది దాడి
Comments
Please login to add a commentAdd a comment