
సాక్షి, అబిడ్స్: హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపను కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, పాప కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని చితకబాదారు. దీంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల ప్రకారం.. అబిడ్స్‌లో కిడ్నాప్‌నకు గురైన ఒకటో తరగతి బాలిక ప్రగతి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్‌లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఎండీ బిలాల్(కిడ్నాపర్) చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కిడ్నాపర్ బిలాల్‌ను బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్‌కు పోలీసులు తీసుకువచ్చారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి.

Comments
Please login to add a commentAdd a comment