‘విట్’ వద్ద సాయిశ్రేయ తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థుల ఆందోళన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.
దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment