
ఘరానా ముఠా: పడిల్లా, స్టెఫానియా, ఒలాదే
బనశంకరి: టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి అత్యాధునిక పరికరాలను వినియోగించి శ్రీమంతుల ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న కొలంబియా దేశానికి చెందిన ముఠాను గురువారం బెంగళూరు ఈశాన్యవిభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 6 కేజీల బంగారు ఆభరణాలు, 9 పిస్టళ్లు, 23 తూటాలు, మూడు పాస్‌పోర్టులు, ఒక నకిలీ పాస్‌పోర్టుతో కలిపి రూ.2.50 కోట్ల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్లు గుళేద్, మురుగన్‌లతో కలిసి మాట్లాడారు. కొలంబియాకు చెందిన పడిల్లా మార్టినేజ్, స్టెఫానియా మనోజ్‌మోసాల్హే, క్రిస్టియన్ యేనీస్‌నవరో ఒలాదే అనే ముగ్గురు ముఠాగా కలిసి చోరీలకు చేస్తున్నారు.
పక్కాగా దోపిడీలు
వీరు టూరిస్ట్ వీసా తో నేపాల్ మీదుగా ఢిల్లీ కి చేరుకుని ముఠా నాయకుడు మింగోస్తావో అలియాస్ తావోను సంప్రదించి అతడి సలహా మేరకు బెంగళూరులో అడుగుపెట్టారు. ఒక సర్వీస్ అపార్టుమెంట్‌లో నివాసం ఉండేవారు. ఎత్తైన గోడలను సైతం సులభంగా దూకే పార్కుర్ అనే విన్యాసంలో నిపుణులు. సైకిల్‌లో తిరుగుతూ నిర్జన ప్రదేశాలు కలిగిన శ్రీమంతులు ఇళ్లను ఆచూకీ కనిపెట్టి అత్యాధునిక పరికరాలను వినియోగించి దోపిడీలకు పాల్పడేవారు. ఇళ్ల ముందు ఎక్కువ న్యూస్‌పేపర్లు పడి ఉంటే అందులో ఎవరూ లేరని భావించేవారు. సాయంత్రం 7 గంటల తరువాత బైక్ లేదా కారులో వచ్చి ఇంటిని దోచుకుని ఉడాయించేవారు. కరోనా వారియర్స్ ధరించే పీపీఈ కిట్ తరహాలో శరీరాన్ని పూర్తిగా కప్పుకుని, చేతులకు గ్లౌస్‌లు వేసుకుని చోరీలు చేసేవారు. ముఠాలోని మహిళ స్టెఫానియాను ఎంచుకున్న ఇంటికి పంపేవారు. కాలింగ్ బెల్ నొక్కేది, ఎవరూ తలుపు తీయకపోతే వాకీటాకీ ద్వారా దగ్గరలో ఉండే గ్యాంగ్ సభ్యులకు సమాచారం ఇచ్చేది, అందరూ కలిసి ఇంటిని గుల్ల చేసేవారని కమిషనర్ తెలిపారు.
ఇలా దొరికారు
కన్నడనటుడు శివరాజ్‌కుమార్ పక్కఇంట్లో చొరబడ్డారని తెలిసి సంపిగేహళ్లి పోలీసులు అక్కడికి వెళ్లగానే కారు ను అక్కడే వదిలిపెట్టి 15 అడుగుల ఎత్తుగల గోడ దూకి ఉడాయించారు. వారు వదిలివెళ్లిన కారు, వాకీటాకీ ఇతర పరికరాలు, సీసీటీవీ చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రెండునెలల పాటు ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఠా సూత్రధారి గుస్తావో కోసం గాలిస్తున్నామని తెలిపారు. చోరీ చేసిన బంగారు నగలను కరిగించి నిల్వచేసేవారు. ఆఫ్రికా దేశాలకు చెందిన ఇస్మాయిల్, ఆంబ్రోస్ అనేవారితో కలిసి కొత్తనూరు, సంపిగేహళ్లి, అమృతహళ్లి, చిక్కజాల, విద్యారణ్యపుర తో పాటు 31కి పైగా చోరీలకు పాల్పడినట్లు తెలిసింది.
ఆధునిక సామగ్రి వాడకం
మొబైల్ ఫోన్ జామర్, పెప్పర్ స్ప్రే, చాకు, డ్రిల్ కిట్ మిషన్, బిట్ మిషన్, లేజర్‌కటింగ్ మిషన్, రింగ్ స్కానర్, కటింగ్‌ప్లేయర్ తదితర సాధనాలు వీరి వద్ద ఉండేవి. మాన్యతాటెక్‌పార్కులోని ఒక ఇంట్లో జర్మన్‌లాకర్‌ను సైతం సులభంగా బద్దలు కొట్టి దోచుకున్నది వీరేనని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment