ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం మహిళదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 24న మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం దిమ్మపై ఉన్న గడ్డివాములో మృతదేహం బయటపడింది.
మంటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం మహిళదా... పురుషుడిదా... అనే విషయంలో పోలీసులు తొలుత నిర్ధారణకు రాలేదు. అయితే, దీనిపై రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి నేతృత్వంలో మండపేట రూరల్ సీఐ శివగణేష్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలించగా, మహిళ తలకు పెట్టుకునే క్లిప్ కాలిన స్థితిలో కనిపించింది.
గడ్డివాము సమీపంలో పగిలిన గాజు ముక్కలు, కొద్దిదూరంలో చెప్పులు దొరికాయి. వీటి ఆధారంగా ఆ మృతదేహం మహిళదేనని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలతోనే కేసు చిక్కుముడి వీడాల్సి ఉంది.
మరోవైపు పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహం వివరాలతో మిస్సింగ్ కేసులను సరిపోల్చుకుని చూస్తున్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఎటువంటి క్లూ దొరకలేదని సమాచారం.
నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయండి : జయశ్రీరెడ్డి
మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుధీర్‌బాబుతో మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళ పట్ల అంత కర్కశత్వానికి పాల్పడిన నేరస్తులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని, ప్రత్యేక బృందాలతో విచారణను ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. నేరస్తులను త్వరగా పట్టుకుంటామన్నారు. కేసు సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment