ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి.. గంజాయి చాక్లెట్లు తెప్పించి.. | Decoy operation by TG ANB officials: Telangana | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి.. గంజాయి చాక్లెట్లు తెప్పించి..

Published Fri, Aug 16 2024 5:02 AM | Last Updated on Fri, Aug 16 2024 5:02 AM

Decoy operation by TG ANB officials: Telangana

సాక్షి, హైదరాబాద్‌: జగిత్యాలలో గంజాయి చాక్లెట్లు తిన్న ఓ బాలుడు వాటి ప్రభావంతో బాలికపై అత్యాచారం చేశాడు. నిజామాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఈ చాక్లెట్లకు బానిసలయ్యారు. మరో పెద్దింటి బిడ్డను బానిసను చేయడానికి ప్రయత్నించారు.  కొత్తూరు, చిట్యాల, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల సమీపంలో ఉన్న దుకాణాల కేంద్రంగా ఈ చాక్లెట్ల దందా సాగింది.  ఇలా 2022 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి. 

ఈ సరుకంతా ఈ–కామర్స్‌ సైట్‌ ఇండియామార్ట్‌ ద్వారా క్యాష్‌ ఆన్‌ డెలివరీ విధానంగా ఇక్కడకు రావడం గమనార్హం. దీనిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్రం అదీనంలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోతో (ఎన్సీబీ) కలిసి పనిచేసి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ల్లో ఉన్న ఎనిమిది ఫ్యాక్టరీలను మూయించారు.  

ఆయుర్వేద మందుల పేరుతో..  
గంజాయి చాక్లెట్ల కర్మాగారాల నిర్వాహకులు ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే..కొరియర్‌ ద్వారా డెలివరీ చేస్తున్నారు. వివిధ పేర్లతో రూపొందిన ఈ చాక్లెట్ల రేఫర్లు, కవర్లపై ఆయుర్వేద మందులుగా, 21 ఏళ్ల పైబడి వారికే అమ్మాలనే హెచ్చరికను ముద్రించారు.

విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి, వారిని బానిసలుగా మారుస్తున్న ఈ చాక్లెట్ల వ్యవహారం టీజీ ఏఎన్‌బీ దృష్టికొచి్చంది. తయారీదారులు చెబుతున్నట్టు అవి ఆయుర్వేద మందులే అయినా, కేవలం డాక్టర్‌ చీటీ ఆధారంగానే విక్రయించాలి. అలా కాకుండా ఆన్‌లైన్‌లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయం గుర్తించారు.  

ఆపరేషన్‌ జరిగిందిలా..  
మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల నమోదుకు వినియోగించే ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ ఎంత కఠినమైందో..అంతే సున్నితమైంది. నిబంధనలు పాటించకపోతే కోర్టుల్లో ఆ కేసులు నిలబడవు. దీంతో టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య, ఎస్పీలు సాయి చైతన్య, సీతారాం వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్‌ ఆపరేషన్‌ చేశారు. అ«దీకృత పంచ్‌ విట్నెస్‌ (సాక్షులు) సమక్షంలోనే ఇండియామార్ట్‌ నుంచి ఆర్డర్‌ ఇచ్చారు. సీఓడీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే చెల్లించారు.

సదరు కంపెనీ కొరియర్‌లో పంపిన చాక్లెట్లను పంచ్‌ విట్నెస్‌ సమక్షంలోనే తీసుకొని పక్కాగా పంచనామా నిర్వహించారు. ఆపై ఈ వ్యవహారాన్ని వివరిస్తూ ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు. మరింతలోతుగా ఆరా తీసిన అధికారులు యూపీ, రాజస్తాన్‌ల్లో ఉన్న 8 గంజాయి చాక్లెట్స్‌ తయారీ కంపెనీలను గుర్తించారు.  

ఎన్సీబీ సహకారంతో దాడులు, అరెస్టులు 
ఈ విషయాలన్నీ టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ దృష్టికి తీసుకెళ్లారు. వారితో కలిసి ఉత్తరప్రదేశ్‌ వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడి బివ్రాన్‌ జిల్లాలో ఉన్న కంపెనీపై దాడి చేసి ఇద్దరు యజ మానులను అరెస్టు చేయించారు. ఆ ప్రాంతంతోపాటు రాజస్తాన్‌లోని మరో ఏడు కంపెనీల్లోనూ సోదాలు చేసి నమూనాలు సేకరించారు. వీటికి సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ఈ గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి ఇండియామార్ట్‌కు టీజీ ఏఎన్‌బీ నోటీసులు పంపించింది. వీటితో స్పందించిన ఆ సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులు అన్నింటినీ తొలగించింది. వీటిని డెలివరీ చేసిన కొరియర్‌ సంస్థలనూ బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126–71111 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలపాలని, అలా చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ‘సాక్షి’కి తెలిపారు.

యూనిట్ల వారీగా గంజాయి చాక్లెట్ల కేసులు ఇలా... 
 సైబరాబాద్‌    20 
హైదరాబాద్‌    10 
రాచకొండ    04 
నల్లగొండ    01 
మెదక్‌    01 
సిరిసిల్ల    01 
రామగుండం    01 
సంగారెడ్డి    01 
వరంగల్‌    01 
నారాయణ
పేట    01 
కొత్తగూడెం    01

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement