decoy operation
-
ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి.. గంజాయి చాక్లెట్లు తెప్పించి..
సాక్షి, హైదరాబాద్: జగిత్యాలలో గంజాయి చాక్లెట్లు తిన్న ఓ బాలుడు వాటి ప్రభావంతో బాలికపై అత్యాచారం చేశాడు. నిజామాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఈ చాక్లెట్లకు బానిసలయ్యారు. మరో పెద్దింటి బిడ్డను బానిసను చేయడానికి ప్రయత్నించారు. కొత్తూరు, చిట్యాల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల సమీపంలో ఉన్న దుకాణాల కేంద్రంగా ఈ చాక్లెట్ల దందా సాగింది. ఇలా 2022 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి. ఈ సరుకంతా ఈ–కామర్స్ సైట్ ఇండియామార్ట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ విధానంగా ఇక్కడకు రావడం గమనార్హం. దీనిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్రం అదీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో (ఎన్సీబీ) కలిసి పనిచేసి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ల్లో ఉన్న ఎనిమిది ఫ్యాక్టరీలను మూయించారు. ఆయుర్వేద మందుల పేరుతో.. గంజాయి చాక్లెట్ల కర్మాగారాల నిర్వాహకులు ఇండియామార్ట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే..కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. వివిధ పేర్లతో రూపొందిన ఈ చాక్లెట్ల రేఫర్లు, కవర్లపై ఆయుర్వేద మందులుగా, 21 ఏళ్ల పైబడి వారికే అమ్మాలనే హెచ్చరికను ముద్రించారు.విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లి, వారిని బానిసలుగా మారుస్తున్న ఈ చాక్లెట్ల వ్యవహారం టీజీ ఏఎన్‌బీ దృష్టికొచి్చంది. తయారీదారులు చెబుతున్నట్టు అవి ఆయుర్వేద మందులే అయినా, కేవలం డాక్టర్ చీటీ ఆధారంగానే విక్రయించాలి. అలా కాకుండా ఆన్లైన్లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయం గుర్తించారు. ఆపరేషన్ జరిగిందిలా.. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల నమోదుకు వినియోగించే ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత కఠినమైందో..అంతే సున్నితమైంది. నిబంధనలు పాటించకపోతే కోర్టుల్లో ఆ కేసులు నిలబడవు. దీంతో టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్‌శాండిల్య, ఎస్పీలు సాయి చైతన్య, సీతారాం వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ చేశారు. అ«దీకృత పంచ్ విట్నెస్ (సాక్షులు) సమక్షంలోనే ఇండియామార్ట్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. సీఓడీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే చెల్లించారు.సదరు కంపెనీ కొరియర్లో పంపిన చాక్లెట్లను పంచ్ విట్నెస్ సమక్షంలోనే తీసుకొని పక్కాగా పంచనామా నిర్వహించారు. ఆపై ఈ వ్యవహారాన్ని వివరిస్తూ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు. మరింతలోతుగా ఆరా తీసిన అధికారులు యూపీ, రాజస్తాన్‌ల్లో ఉన్న 8 గంజాయి చాక్లెట్స్ తయారీ కంపెనీలను గుర్తించారు. ఎన్సీబీ సహకారంతో దాడులు, అరెస్టులు ఈ విషయాలన్నీ టీజీ ఏఎన్‌బీ అధికారులు ఎన్సీబీ దృష్టికి తీసుకెళ్లారు. వారితో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడి బివ్రాన్ జిల్లాలో ఉన్న కంపెనీపై దాడి చేసి ఇద్దరు యజ మానులను అరెస్టు చేయించారు. ఆ ప్రాంతంతోపాటు రాజస్తాన్‌లోని మరో ఏడు కంపెనీల్లోనూ సోదాలు చేసి నమూనాలు సేకరించారు. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి ఇండియామార్ట్కు టీజీ ఏఎన్‌బీ నోటీసులు పంపించింది. వీటితో స్పందించిన ఆ సంస్థ తమ వెబ్సైట్లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులు అన్నింటినీ తొలగించింది. వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలనూ బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126–71111 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని, అలా చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘సాక్షి’కి తెలిపారు.యూనిట్ల వారీగా గంజాయి చాక్లెట్ల కేసులు ఇలా... సైబరాబాద్ 20 హైదరాబాద్ 10 రాచకొండ 04 నల్లగొండ 01 మెదక్ 01 సిరిసిల్ల 01 రామగుండం 01 సంగారెడ్డి 01 వరంగల్ 01 నారాయణపేట 01 కొత్తగూడెం 01 -
వైద్యాధికారుల డెకాయ్ ఆపరేషన్.. ఆస్పత్రి యజమాని అరెస్ట్
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): కామారెడ్డిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో గల కౌసల్య ఆస్పత్రి యజమాని సిద్దిరాములును పోలీసులు గురువారం ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తుండగా, ఈ నెల 15న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యం లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన వైద్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 312, 420,23 ప్రకారం ఆస్పత్రిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్పత్రి నిర్వాహకుడు నడిపి సిద్దిరాములును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో మధుసూదన్ తెలిపారు. వైద్యఅర్హత, అనుమతులు లేకుండానే ఆస్పత్రి నిర్వహించడంతో పాటు అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నందుకు గాను అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
హైదరాబాద్ మెట్రోలో వృద్ధుడి వికృత చర్య
సాక్షి, హైదరాబాద్ : ఆయన వయస్సు సుమారు 65ఏళ్లు ఉండొచ్చు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం అసహ్యించుకోకుండా ఉండలేరు. భాగ్యనగరంలో మెట్రో ప్రారంభమైన పదిరోజులకే ఓ 65 ఏళ్ల వృద్ధుడు మెట్రోలో ఎక్కిన మహిళల, యువతుల ఫోటోలను తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ నరసింహా(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మొబైల్ ఫోన్‌తో తీస్తూ షీ టీమ్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడు. ఆయనగారి ఫోన్ తనిఖీ చేయగా అప్పటికే ఆ ఫోన్లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రగ్స్ వయా సోషల్ మీడియా!
♦ విక్రయం ప్రారంభించిన ‘తెలుగు టెక్కీలు’ ♦ వలపన్ని పట్టుకున్న బెంగళూరు పోలీసులు ♦ ఫేస్బుక్లో ఓ పేజ్‌నే ఏర్పాటు చేసిన వైనం ♦ ‘మాల్’ ఇక్కడ్నుంచే.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఇద్దరు టెక్కీలు బెంగళూరులో సరికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో భాగమైన ఫేస్బుక్లో ఓ పేజ్ క్రియేట్ చేసిన ఈ ద్వయం దాని ఆధారంగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు డిటెక్టివ్ క్రైమ్ బ్రాంచ్ (డీసీబీ) అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గురువారం ఇరువురినీ అరెస్టు చేశారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీహరి (23), ఒంగోలుకు చెందిన కె.అర్జున్ (28) హైదరాబాద్‌లో విద్యనభ్యసించినప్పుడు స్నేహితులుగా మారారు. బీటెక్ పూర్తి చేసిన ఈ ద్వయం ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు వెళ్లి అక్కడి చలఘట్ట ప్రాంతంలో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉండగానే డ్రగ్స్‌కు అలవాటు పడిన వీరిద్దరూ కొన్నాళ్లకు వాటిని విక్రయించే పెడ్లర్స్‌గా మారారు. ఫేస్బుక్లో పేజ్ ఏర్పాటు చేసి... హైదరాబాద్‌లోని కొందరు హోల్‌సేలర్స్ నుంచి గంజాయితో పాటు బొమ్మలుండే స్టాంపుల రూపంలో ఉండే ఎల్ఎస్డీ (లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్) మాదకద్రవ్యాలను సేకరిస్తున్నారు. వీటిని బెంగళూరులో విక్రయించడానికి శ్రీహరి ఏకంగా ఫేస్బుక్లో ‘బెంగళూరు డీడ్ స్పోకీస్’ పేరుతో పేజ్ ఏర్పాటు చేశాడు. 3,814 మంది లైక్ చేసి, ఫాలో అవుతున్న దీని ద్వారానే ఆర్డర్లు స్వీకరిస్తూ, అవసరమైన వారిని కలసి మాదకద్రవ్యాలు విక్రయించడం ప్రారంభించారు. వీటి సరఫరా బాధ్యతలను అర్జున్ చేపట్టాడు. బెంగళూరు సీసీబీ అధికారులకు ఈ ‘సోషల్ దందా’పై నెల రోజుల క్రితం సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. వినియోగదారుల మాదిరిగానే ఫేస్బుక్ పేజ్‌లో తమకు డ్రగ్స్ కావాలంటూ పోస్టింగ్ పెట్టారు. దీనికి స్పందించిన శ్రీహరి ‘కాంటాక్ట్ మీ’ అంటూ తన సెల్‌ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహణ సీసీబీకి చెందిన ఓ అధికారి స్వయంగా వినియోగదారుడి మాదిరిగా శ్రీహరిని ఫోనులో సంప్రదించారు. తనకు గంజాయి కావాలని చెప్పడంతో గురువారం కడుగోడి ప్రాంతానికి రమ్మంటూ శ్రీహరి నుంచి సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ వలపన్నిన పోలీసులు డ్రగ్‌ను విక్రయిస్తున్న నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో అర్జున్ను అరెస్టు చేసిన అధికారులు.. వీరి నుంచి గంజాయితో పాటు ఎల్ఎస్డీ స్టాంపులు స్వాధీనం చేసుకుని కేసును కడుగోడి పోలీసులకు అప్పగించారు. ఈ నిందితులకు మాదకద్రవ్యాలు హైదరాబాద్ నుంచి సరఫరా అవుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో దర్యాప్తు నిమిత్తం వచ్చే వారం ఇక్కడికి ఓ ప్రత్యేక బృందాన్ని పంపడానికి బెంగళూరు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఎస్పీ సుమతి డెకాయ్ ఆపరేషన్
తూప్రాన్: దాబా హోటళ్లలో మద్యం సిట్టింగ్, విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఎస్పీ సుమతి హెచ్చరించారు. తూప్రాన్‌లోని దాబా హోటళ్లపై బుధవారం రాత్రి 10 సమయంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ మార్గంలో సన్దాబాలో మద్యం సిట్టింగ్‌లను గమనించిన ఎస్సీ వెంటనే తన వాహనాన్ని పక్కన పెట్టించి సివిల్ డ్రెస్‌లో ఉన్న తన గన్మెన్లను దాబా హోటల్‌కు పంపించి మద్యం కొనుగోలు చేయమని ఆదేశించారు. దీంతో తన సిబ్బంది వెంటనే దాబాలోకి ప్రయాణికుల మాదిరిగా వెళ్లారు. తమకు మద్యం కావాలని కోరడంతో దాబా నిర్వహకుడు బ్లెండర్‌స్పైడ్ మద్యం బాటిల్‌ను విక్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సీ సుమతి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ.సంతోష్‌కుమార్‌లు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దాబా నిర్వహకుణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాబా హోటళ్లలో మద్యం విక్రయించినా, సిట్టింగ్‌లను నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహించి వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో తూప్రాన్‌లోని పలు దాబాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.