
సాక్షి, హైదరాబాద్ : ఆయన వయస్సు సుమారు 65ఏళ్లు ఉండొచ్చు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం అసహ్యించుకోకుండా ఉండలేరు. భాగ్యనగరంలో మెట్రో ప్రారంభమైన పదిరోజులకే ఓ 65 ఏళ్ల వృద్ధుడు మెట్రోలో ఎక్కిన మహిళల, యువతుల ఫోటోలను తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్ నరసింహా(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మొబైల్ ఫోన్‌తో తీస్తూ షీ టీమ్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడు. ఆయనగారి ఫోన్ తనిఖీ చేయగా అప్పటికే ఆ ఫోన్‌లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.