డ్రగ్స్ వయా సోషల్ మీడియా!
♦ విక్రయం ప్రారంభించిన ‘తెలుగు టెక్కీలు’
♦ వలపన్ని పట్టుకున్న బెంగళూరు పోలీసులు
♦ ఫేస్‌బుక్‌లో ఓ పేజ్‌నే ఏర్పాటు చేసిన వైనం
♦ ‘మాల్’ ఇక్కడ్నుంచే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఇద్దరు టెక్కీలు బెంగళూరులో సరికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో భాగమైన ఫేస్‌బుక్‌లో ఓ పేజ్ క్రియేట్ చేసిన ఈ ద్వయం దాని ఆధారంగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు డిటెక్టివ్ క్రైమ్ బ్రాంచ్ (డీసీబీ) అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గురువారం ఇరువురినీ అరెస్టు చేశారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీహరి (23), ఒంగోలుకు చెందిన కె.అర్జున్ (28) హైదరాబాద్‌లో విద్యనభ్యసించినప్పుడు స్నేహితులుగా మారారు. బీటెక్ పూర్తి చేసిన ఈ ద్వయం ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా బెంగళూరుకు వెళ్లి అక్కడి చలఘట్ట ప్రాంతంలో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉండగానే డ్రగ్స్‌కు అలవాటు పడిన వీరిద్దరూ కొన్నాళ్లకు వాటిని విక్రయించే పెడ్లర్స్‌గా మారారు.
ఫేస్‌బుక్‌లో పేజ్ ఏర్పాటు చేసి...
హైదరాబాద్‌లోని కొందరు హోల్‌సేలర్స్ నుంచి గంజాయితో పాటు బొమ్మలుండే స్టాంపుల రూపంలో ఉండే ఎల్‌ఎస్‌డీ (లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్) మాదకద్రవ్యాలను సేకరిస్తున్నారు. వీటిని బెంగళూరులో విక్రయించడానికి శ్రీహరి ఏకంగా ఫేస్‌బుక్‌లో ‘బెంగళూరు డీడ్ స్పోకీస్’ పేరుతో పేజ్ ఏర్పాటు చేశాడు. 3,814 మంది లైక్ చేసి, ఫాలో అవుతున్న దీని ద్వారానే ఆర్డర్లు స్వీకరిస్తూ, అవసరమైన వారిని కలసి మాదకద్రవ్యాలు విక్రయించడం ప్రారంభించారు. వీటి సరఫరా బాధ్యతలను అర్జున్ చేపట్టాడు. బెంగళూరు సీసీబీ అధికారులకు ఈ ‘సోషల్ దందా’పై నెల రోజుల క్రితం సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. వినియోగదారుల మాదిరిగానే ఫేస్‌బుక్ పేజ్‌లో తమకు డ్రగ్స్ కావాలంటూ పోస్టింగ్ పెట్టారు. దీనికి స్పందించిన శ్రీహరి ‘కాంటాక్ట్ మీ’ అంటూ తన సెల్‌ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు.
డెకాయ్ ఆపరేషన్ నిర్వహణ
సీసీబీకి చెందిన ఓ అధికారి స్వయంగా వినియోగదారుడి మాదిరిగా శ్రీహరిని ఫోనులో సంప్రదించారు. తనకు గంజాయి కావాలని చెప్పడంతో గురువారం కడుగోడి ప్రాంతానికి రమ్మంటూ శ్రీహరి నుంచి సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ వలపన్నిన పోలీసులు డ్రగ్‌ను విక్రయిస్తున్న నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో అర్జున్‌ను అరెస్టు చేసిన అధికారులు.. వీరి నుంచి గంజాయితో పాటు ఎల్‌ఎస్‌డీ స్టాంపులు స్వాధీనం చేసుకుని కేసును కడుగోడి పోలీసులకు అప్పగించారు. ఈ నిందితులకు మాదకద్రవ్యాలు హైదరాబాద్ నుంచి సరఫరా అవుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో దర్యాప్తు నిమిత్తం వచ్చే వారం ఇక్కడికి ఓ ప్రత్యేక బృందాన్ని పంపడానికి బెంగళూరు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.