ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి | District Malaria Officer in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి

Published Wed, Jan 31 2024 4:51 AM | Last Updated on Wed, Jan 31 2024 4:51 AM

District Malaria Officer in ACB net - Sakshi

ఒంగోలు టౌన్‌: పీఆర్సీ అరియర్స్‌ బిల్లు మంజూరు చేసేందుకు 25 శాతం లంచం డిమాండ్‌ చేసిన ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, ఆమెకు సహకరించిన అసిస్టెంట్‌ జిల్లా అధికారి శీనయ్యను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని దోర్నాల పీహెచ్‌సీలో మల్టిపర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఇజ్రాయిల్‌కు 2015–21 పీఆర్సీ అరియర్స్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీని పలుమార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. పెండింగ్‌ బిల్లులో 25 శాతం లంచం ఇస్తే తాను బిల్లు మంజూరు చేస్తానని డిమాండ్‌ చేశారు. దాంతో ఇజ్రాయిల్‌  తనకు రావాల్సిన అరియర్స్‌తో పాటు..తన అర్హతల ప్రకారం పదోన్నతి కలి్పంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో స్పందించిన రీజినల్‌ డైరెక్టర్, ఇజ్రాయిల్‌ అరియర్స్‌ డబ్బులు ఎందుకు మంజూరు చేయలేదో వివరణ ఇవ్వాల్సిందిగా డీఎంఓకు మెమో ఇచ్చారు.

అలాగే కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు గానూ రిమార్క్స్‌ అడిగారు. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో ఇజ్రాయిల్‌  అరియర్స్‌ పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేశారు. బిల్లు డబ్బులు బ్యాంకులో జమ అయిన వెంటనే తనకు లంచం డబ్బులు ఇవ్వాలని కోరారు.  ఈనెల 10వ తేదీ అరియర్స్‌ తాలుకు రూ.16,83,103 బ్యాంకులో జమయ్యాయి. జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ జరిగిన మీటింగ్‌కు  హాజరయ్యేందుకు ఇజ్రాయిల్‌ ఒంగోలుకు వచ్చారు. మీటింగ్‌ అయిపోయాక తన ఇంటికి వచ్చి కలవాలని డీఎంఓ జ్ఞానశ్రీ అతడిని ఆదేశించారు.

అసిస్టెంట్‌ మలేరియా అధికారి శీనయ్యను ఇందుకు పురమాయించారు. దాంతో ఇద్దరూ కలిసి జ్ఞానశ్రీ ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగా ఫోన్‌ చేసిన డీఎంఓ తాను ఇంట్లో లేనని, వర్మాస్‌ హోటల్‌కు వచ్చి కలవాలని చెప్పారు. అక్కడ బిల్లుల డబ్బులు బ్యాంకులో పడ్డాయి కనుక ముందుగా చెప్పిన ప్రకారం తనకు బిల్లు మొత్తంలో 25 శాతం రూ.4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడి డైరీలో ఉన్న చెక్‌బుక్కును చూసి ఆమె చెక్కు రాసివ్వాలని డిమాండ్‌ చేశారు. చెక్‌ చెల్లదని చెప్పడంతో ఏటీఎం, పేటీఎంల ద్వారా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

 అయితే రూ.4 లక్షలు ఇవ్వలేనని బతిమాలు కోవడంతో చివరికి రూ.1.40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయిల్‌ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం జ్ఞానశ్రీకి డబ్బులు ఇస్తానని చెప్పడంతో వాటిని  తీసుకునేందుకు అసిస్టెంట్‌ మలేరియా అధికారి శీనయ్యను సమీపంలోని సూపర్‌ బజార్‌ వద్దకు పంపించారు. అక్కడ ఇజ్రాయిల్‌ నుంచి డబ్బులు తీసుకుంటున్న శీనయ్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత జిల్లా మలేరియా కార్యాలయానికెళ్లి డీఎంవో జ్ఞానశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement