పలమనేరు (చిత్తూరు జిల్లా): వివిధ మాదకద్రవ్యాల తయారీకి వినియోగించే ఓపీఎం పోపీ (గసగసాలు) సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన మరో ముఠా ఈ అంతర్జాతీయ మాఫియాకు సహకారమందిస్తోంది. అంతేకాకుండా వీటిని స్థానికంగా పండించడానికి రైతులకు విత్తనాలను అందించడం వంటివి చేస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో తాజాగా ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓపీఎం పోపీ సాగు వివరాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ పంటను సాగు చేస్తున్న పలువురు రైతులను అరెస్టు కూడా చేశారు. అయితే పంటను ఎవరు సాగు చేయమన్నారు? ఎవరు కొంటారు? ఎక్కడికి తీసుకెళ్తారనే విషయాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రధానంగా దృష్టి సారించింది. సోమవారం ముంబైకి చెందిన భార్యాభర్తలను అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో మత్తు పదార్థాల రవాణా వెనుక బెంగళూరు, ముంబై లింకులతో కూడిన అంతర్జాతీయ మాఫియా, ఉగ్రవాదులు హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర సరిహద్దుల్లోనే రహస్య సాగు..
కర్ణాటకకు ఆనుకుని ఉన్న రాష్ట్ర సరిహద్దు గ్రామాలతోపాటు కోలారు జిల్లాలో రహస్యంగా ఓపీఎం పోపీ సాగు గత పదేళ్ల నుంచే సాగుతోంది. ఈ పంటకు సంబంధించిన ముఠా ఏజెంట్లు కర్ణాటకలోని బెంగళూరు, కోలారు, చింతామణి, శ్రీనివాసపుర, దొడ్డబళ్లాపుర, పావగడ తదితర ప్రాంతాలతోపాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వందలాదిమంది ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు కొద్ది మొత్తం మాత్రమే విదిల్చి.. ఏజెంట్లు కోట్లాది రూపాయలు విలువైన పంటను ఇప్పటికే తరలించినట్లు భావిస్తున్నారు. స్థానికంగా రైతులకు ఈ పంట విత్తనాలను అందిస్తూ.. ఆ తర్వాత పంటను కొనుగోలు చేసే ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకొనే పనిలో అధికారులు ఉన్నారు. ఈ ముఠాను పట్టుకుంటే.. దీని ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మాఫియాను ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లే నిర్వహిస్తున్నారనే అనుమానాలున్నాయి.
కాయ నుంచి వస్తున్న జిగురు..
గత టీడీపీ ప్రభుత్వ పాపమే..
ఈ మత్తు పంట సాగవుతోందని తెలిసినా గత టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఏటా పంటల నమోదును రెవెన్యూ శాఖ చేపడుతుందనేది తెలిసిన సంగతే. పదేళ్లుగా ఈ పంట రహస్యంగా సాగవుతున్నప్పుడు గత ప్రభుత్వం ఈ పంటను ఎందుకు నమోదు చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అలాగే వ్యవసాయ శాఖ కూడా నిషేధిత జాబితాలో ఉన్న ఈ పంటను సాగు చేయొద్దని రైతులను హెచ్చరించిన దాఖలాలు లేవు.
డ్రగ్స్ తయారీకి వాడే మొక్క బెరడు- కాయలోపల గసగసాలు..
మొక్క నుంచి అంతా లాభమే..
మామూలుగా ఓపీఎం పోపీ మొక్క నుంచి గసగసాలతోపాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తున్నారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు.. దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్, మార్ఫిన్ వంటి మత్తు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయారుచేస్తున్నట్లు గతంలోనే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇళ్లల్లోనే పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారుచేసి.. ఆ ప్యాకెట్లను ఇక్కడి నుంచి ఆటోలు, కార్లు, ప్రైవేటు బస్సుల్లో బెంగళూరుకు పంపుతున్నారు.
బొంబాయి క్రిష్ణమ్మ, బల్కర్‌సింగ్ అరెస్ట్.. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే గసగసాలు (ఓపీఎం పోపీ) సాగు కేసులో సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె ఎస్‌ఈబీ పోలీసులు ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ (50), ఆమె భర్త బల్కర్ సింగ్(60)లను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్‌ఈబీ డీఎస్పీ పోతురాజు, సీఐ కేవీఎస్ ఫణీంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మదనపల్లె మండలం మాలేపాడులో నిషేధిత గసగసాల పంటను సాగు చేసిన కత్తివారిపల్లెకు చెందిన బొమ్మరాసి నాగరాజు(45), అతడి మామ అల్లాకుల లక్షుమన్న (60), బావమరిది ఎ.సోమశేఖర్ (26)లను మార్చి 14న పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే గసగసాల సాగుకు విత్తనాలను సరఫరా చేసిన చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మిరి వెంకట రమణ అలియాస్ నాగరాజు (50), రేవణ కుమార్ (46)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు అందించిన సమాచారంతో ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ, ఆమె భర్త బల్కర్ సింగ్‌లను తాజాగా అరెస్టు చేశారు. వారిని మదనపల్లె కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా, త్వరలోనే డ్రగ్ మాఫియాలోని ప్రధాన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
చదవండి:
ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది
జనసేన, టీడీపీ చెట్టాపట్టాల్..
Comments
Please login to add a commentAdd a comment