న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నుండి భారత్ వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్ ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు.
ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం.. రాజస్థాన్లోని అజ్మీర్ కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్ కు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగు పెడుతూనే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు.
తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుండి అతడిని నేరుగా పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సులేమాన్ నుండి పాస్ పోర్టు సహా అన్ని వస్తువులను లాక్కున్నారు దుండగులు. అక్కడి నుండి కారులో మహిపాల్ పూర్ వైపుగా తీసుకెళ్లి మార్గమధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ఈ ఫోన్ ఎక్కడిది? ఈ కరెన్సీ నీకెలా వచ్చిందని ప్రశ్నించి సులేమాన్ ఫోన్ తోపాటు అతని వద్దనున్న 19000 సౌదీ రియాద్లు(4.15 లక్షలు), రూ.2000 నగదును దోచుకున్నారు.
నిలువుదోపిడీ పూర్తయిన తర్వాత దుండగులు సులేమాన్ ను కార్లో తీసుకెళ్లి జనసంచారం లేనిచోట దింపేసి ఉన్నతాధికారులతో తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికి గాని జరిగిందేంటో అర్ధం కాని సులేమాన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి..
Comments
Please login to add a commentAdd a comment