చండీగఢ్: గుర్తు తెలియని ఆగంతకుల కాల్పులతో పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిబిరంలోని శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భోజనశాల పక్కనే ఉన్న బ్యారక్‌లలో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడి చేశారా? మరొకరి పనా ? అనేది భారత సైన్యం ఇంకా స్పష్టంచేయలేదు.
ఘటన విషయం తెల్సిన వెంటనే సత్వర స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. సాధారణ దుస్తులు, ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పుల ఘటన తర్వాత ఆ బ్యారక్ నుంచి బయటికొచ్చి అటవీ ప్రాంతం వైపు పారిపోయారనే ప్రత్యక్ష సాక్షి అయిన ఒక జవాను చెప్పారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. ఆగంతకుల కోసం వేట మొదలుపెట్టారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీతూటాలు లభించాయి.
రెండ్రోజుల క్రితం ఇక్కడే ఇన్సాస్ రైఫిల్‌తోపాటు 28 రౌండ్ల తుపాకీ గుళ్ల చోరీ ఘటనకు, ఈ దాడికి సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తును చేస్తున్నట్లు ఆర్మీ నైరుతి కమాండ్ తెలిపింది. ఘటన తాలూకు సమగ్ర వివరాలను సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఉగ్రదాడి కాదు. ‘బయటివాళ్ల’ పని అస్సలు కాదు. ఆర్మీతో సమన్వయంతో ఈ ఘటనపై శోధిస్తున్నాం’’ అని పంజాబ్ అదనపు డీజీపీ పార్మర్ చెప్పారు.
ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదని భటిండా పోలీస్ కంటోన్మెంట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గుర్మీత్ సింగ్ స్పష్టంచేశారు. ‘ ఇది అంతర్గత వ్యక్తుల దాడిలా తోస్తోంది. ఫోరెన్సిక్ బృందం సంబంధిత ఆధారాలను సేకరిస్తోంది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తాం’ అని భటిండా సీనియర్ ఎస్పీ గులీ్నత్ సింగ్ ఖురానా మీడియాతో చెప్పారు. చోరీకి గురైన రైఫిల్ దొరికినట్లు సమాచారం. మరణించిన జవాన్లలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు. ఘటనాస్థలిలోకి ఎవరూ రాకుండా ఆర్మీ నిషేధ ఆంక్షలు విధించింది.
చదవండి: ఏడు నెలల గర్భిణి.. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగిన ప్రియురాలు.. నల్లమల అడవిలోకి తీసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment