సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో నమోదైన ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కేసులో సింగపూర్ దేశానికి చెందిన సంస్థ మూలం కాగా.. చైనా దేశీయుడు ప్రధాన సూత్రధారి అని అర్బన్ జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ఫైనాన్సర్‌ల వేధింపులు తాళలేక గత ఏడాది డిసెంబర్ 21న తీగత దుర్గ అనే మహిళ స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన సీఐ రాజశేఖర్‌రెడ్డి దర్యాప్తులో భాగంగా ఇదే విధమైన కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినట్టు గుర్తించారు. వారిలో నలుగురు ఇక్కడ నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. నిందితులు చైనాకు చెందిన భాయ్ అలియాస్ డెన్నీస్, రాజస్థాన్‌కు చెందిన సత్యపాల్ క్యాలియా, అనిరుథ్ మల్హోత్ర, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన హేమంత్ సేథ్‌లను ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. అనంతరం వీరిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బుధవారంతో పోలీస్ కస్టడీ ముగియనుంది.
విచారణలో వెలుగు చూసిన విషయాలివీ..
సింగపూర్ దేశానికి చెందిన ఓ సంస్థ ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించగా.. మన దేశంలో ఈ సంస్థ వ్యవహారాలను చైనాకు చెందిన డెన్నిస్ చక్కబెట్టాడు. అతడు మన దేశానికి వచ్చి గుర్‌గ్రామ్‌లో సింగపూర్ సంస్థ తరఫున ‘స్కైలిన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌ను తయారు చేశాడు. ఈ లోన్ యాప్స్‌కు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను లింక్ చేసుకుని రుణాలు మంజూరు చేయడం మొదలు పెట్టారు. రుణాలు మంజూరు చేసే సమయంలో రుణగ్రహీత అందజేస్తున్న ఫొటో, ఆధార్, ఓటర్, బ్యాంక్ పాస్ బుక్ స్టేట్‌మెంట్స్ సరైనవో కాదో నిర్ధారించుకోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వీరు వినియోగించారు. రుణం ఇచ్చే మొత్తం నుంచి 20 నుంచి 30 శాతం ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో మినహాయించుకునే వారు. వడ్డీ మాత్రం తీసుకున్న రుణ మొత్తానికి వసూలు చేసేవారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రిజర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వారానికి 24 శాతం వడ్డీని రుణగ్రహీతల నుంచి వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఈముఠా యాప్‌లు 200
ఈ ముఠా 200 ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌ను రూపొందించగా.. వీటిలో చాలావరకు తెలంగాణ పోలీసులు గుర్తించి గూగుల్‌కు సిఫార్సు చేయగా, గూగుల్ వాటిని తొలగించింది. మరికొన్నింటిని ముఠా సభ్యులే తొలగించారని తెలిసింది. నిందితులు భారతదేశంలో నెలకొల్పిన సింగపూర్ బ్రాంచ్ కంపెనీ 11 రకాల పేర్లతో ఫైనాన్షియల్ టెక్నాలజీలకి సంబంధించిన యాప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంచి ప్రజలకు వాటికి సంబంధించిన లింక్‌లను పంపుతూ యాప్ డౌన్‌లోడ్‌లు చేసుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లు అభివృద్ధి చేసిన 11 యాప్‌ల పేర్లు ఇవీ.. మనీ బాక్స్, లోన్ గ్రామ్, లోన్ కార్డ్, ఆ క్యాష్, మింట్ క్యాష్, క్యాష్ ట్రైన్, సూపర్ క్యాష్, హ్యాపీ క్యాష్, సూపర్ బస్, రూపీ వన్, మనీ క్యాష్.
కాలయాపనను బట్టి వేధింపులు
రుణగ్రహీతల నుంచి డబ్బు తిరిగి వసూలవడంలో జరిగే కాలాన్ని బట్టి వీరి వేధింపుల స్థాయి పెరుగుతుంటుందని తెలిసింది. ఒక రోజు ఆలస్యంగా డబ్బు చెల్లిస్తే సాధారణం, రెండు రోజులైతే మధ్యస్తం, మూడు నాలుగు రోజులైతే అసభ్య పదజాలంతో దూషించడం, ఐదు రోజులు ఆపైన ఆలస్యమైతే డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్నారని బంధువులు, స్నేహితులకు సందేశాలు పంపడం వీరి వేధింపుల్లో భాగమని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో, ఉత్తరాది రాష్ట్రాల కోసం ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కోసం బెంగళూరు, ఇలా వివిధ నగరాల్లో వీరు కాల్ సెంటర్‌లను నెలకొల్పినట్టు నిందితులు పోలీస్ విచారణలో వెల్లడించారు.
ఆటకట్టించే పనిలో పోలీసుల నిమగ్నం
గుంటూరు నగరంలోని కొత్తపేటలో నమోదైన కేసులో బాధిత మహిళకు ఏ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు జమ అయింది? బాధితురాలు ఏ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ చేసింది? అనే సమాచారాన్ని రాబట్టి ఫైనాన్సర్ల ఆటకట్టించే పనిలో అర్బన్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా జరిగినట్టు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాన్సాక్షన్ ఐడీల ద్వారా బ్యాంక్ ఖాతాలను గుర్తించి నోటీసులు పంపినట్టు సమాచారం. హైదరాబాద్ పోలీసులు ఇదే తరహాలో నోటీసులు ఇవ్వగా రూ.వేల కోట్లలో నగదు ఆయా బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ అయినట్టు సమాచారం. కొత్తపేట కేసులో అరెస్టయిన ఈ నలుగురు నిందితులకు తాడేపల్లి, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లోనూ ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు నిందితులను పీటీ వారెంట్‌పై అరెస్ట్ చూపి, అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది.
ఎవరూ మోసపోవద్దు
మీ ఫోన్లకు ఇన్‌స్టంట్ లోన్స్ అంటూ సందేశాలు, ఫోన్లు వస్తే నమ్మొద్దు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ తరహా లోన్లు తీసుకుని ఇబ్బందులకు గురవుతుంటే పోలీసులను సంప్రదించాలి.
– ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment