ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది.
పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు
ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ?
పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు.
పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు
పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు.
వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు
పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు.
ఇన్‌చార్జ్‌ల వేధింపులు
రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె.
పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను
తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు.
పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు
పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు.
ఆగ్రా ఎస్‌ఎస్‌పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు.
Comments
Please login to add a commentAdd a comment