
మృతి చెందిన బాలిక తేజశ్రీలక్ష్మితో తల్లిదండ్రులు , మంగాదేవి (ఫైల్)
యానాం/ఐ.పోలవరం: పూర్వపు తూర్పు గోదావరి జిల్లా.. ప్రస్తుత కోనసీమ జిల్లాలోని 216 జాతీయ రహదారిలో ఎదుర్లంక–యానాం బాలయోగి వారధిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నలుగురు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసుల కథనం ప్రకారం..
జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన దంపతులు గుబ్బల సుబ్రమణ్యం (49), గుబ్బల మంగాదేవి (44).. మనమడు యశ్వంత్ శివకార్తీక్ (3), మనవరాలు తేజశ్రీలక్ష్మి (6)తో కలిసి మోటార్‌సైకిల్‌పై రామచంద్రపురం సమీపంలోని ద్రాక్షారామ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. అదే సమయంలో.. బాలయోగి వారధిపై అమలాపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఆటోను తప్పించబోయి వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో సుబ్రమణ్యం, మంగాదేవి, అనసూరి జశ్వంత్ శివకార్తీక్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మిని స్థానికులు హుటాహుటిన అమలాపురం ఆసుపత్రికి, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతిచెందింది.
కుమార్తె ఇంటికి వెళ్లొస్తూ..
సుబ్రమణ్యం, మంగాదేవి దంపతులు శనివారం ద్రాక్షారామలోని చిన్న కుమార్తె అనసూరి వెంకటేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె పిల్లలు శివకార్తీక్, తేజశ్రీలక్ష్మీలను తీసుకుని ఆదివారం సాయంత్రం బయలుదేరి ఈ ప్రమాదానికి గురయ్యారు. సుబ్రమణ్యం రొయ్యల చెరువుల వద్ద కూలిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంతో అమలాపురం–కాకినాడ మధ్య సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment