మూడేళ్ల వయసులో తల్లి వదిలేసింది
రెండేళ్ల క్రితం తండ్రి ఆత్మహత్య
ఇప్పుడు ఆ బాలిక బలవన్మరణం
దుండిగల్ స్పూర్తి ఫౌండేషన్‌లో ఘటన
దుండిగల్: మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. రెండేళ్ల క్రితం తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదకొండేళ్ల వయస్సులోనే ఈ రెండు ఘటనలు ఆ బాలికను కలచివేశాయి. అయినాసరే తట్టుకుని చదువుతోంది.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా ఏమైందో ఏమో అనుమానాస్పద స్థితిలో అనాథాశ్రమంలో బలవన్మరణానికి పాల్పడింది.
సూరారం ప్రాంతానికి చెందిన దివంగత నీలం సతీశ్ కుమార్తె వైష్ణవి(11) దుండిగల్‌లోని స్పూర్తి ఫౌండేషన్‌లో ఆరవ తరగతి చదువుతూ అక్కడే ఉంటోంది. వదిన పెళ్లి ఉండటంతో ఈ నెల 3న ఇంటికి వెళ్లిన వైష్ణవి అక్కడ బంధువులతో సంతోషంగా గడిపింది. 8న తిరిగి ఫౌండేషన్‌కు వచ్చింది. ఉదయం తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడింది. అదే రోజు మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైష్ణవి ఉరి వేసుకున్న గదిలోనే గతేడాది మరో బాలిక ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉందని, 8వ తేదీ మధ్యాహ్నం వరకు స్నేహితులతో ఆటలు ఆడిందని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment