
పుత్తూరు/చిత్తూరు: పిల్లులు పట్టుకుంటామని చెప్పి చోరీకి పాల్పడిన ఘటన పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరిగింది. బాధితుడు ఎం.గణేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తిమ్మాపురం గ్రామంలోకి 4 మోటర్ సైకిళ్లపై ఆరుగురు మగవారు, ఇద్దరు మహిళలు వచ్చారు. గ్రామంలోని పిల్లులను పట్టుకొంటామంటూ గణేష్ ఇంటి వద్దకు వచ్చి అతని తల్లి మోహనమ్మతో మాట కలిపారు.
ఓ మహిళ మోహనమ్మతో మాట్లాడుతుండగా, ఇంటికి ఇరువైపులా ఉన్న సందులో పిల్లుల కోసం ముగ్గురు వల వేసినట్లు నటిస్తూ, ఎవరూ దగ్గరకు రావొద్దంటూ చెప్పారు. మరో మహిళ ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని 7.5 సవర్ల బంగారు నగలు, 180 గ్రాముల వెండి గొలుసు, వెయ్యి రూపాయల నగదును దోచుకెళ్లారు. సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన గణేష్ దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పోలీసులు ఇంటిని పరిశీలించారు. ఎస్‌ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోటర్ సైకిల్ చోరీ
పిల్లుల పేరిట జరిగిన దొంగతనం గురించి చర్చించుకుంటూ సోమవారం రాత్రి నిద్రలోకి జారుకొన్న తిమ్మాపురం గ్రామస్తులకు మరో దొంగతనంతో తెల్లవారింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేష్ సోమవారం రాత్రి తన బైక్‌ను ఇంటి ఆవరణలో పార్క్ చేశాడు. మంగళవారం ఉదయం చూడగా మోటర్ సైకిల్ కనబడలేదు. అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment