మెదక్ : జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీవ్ర వర్షాలు.. గుంతలు, బురదతో అధ్వానంగా మారిన రోడ్డు ఓ పదేళ్ల బాలిక జీవితాన్ని బలిగొంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రోడ్డు కారణంగా ఆలస్యమై ఆ చిన్నారి కన్నుమూసింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహ్మద్‌నగర్ తండా పంచాయతీ పరిధిలోని అందుగులపల్లి(పెద్దమ్మగడ్డ తండా)లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది.
వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు తండాకు వెళ్లే మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి బురదతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సోమవారం తండాకు చెందిన కులబాబు, రేణుక దంపతుల కూతురు అక్షర (10) తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను బైక్‌పై ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు.
ఈ క్రమంలో బురదలో బైక్ ముందుకు కదలలేదు. దీంతో పాపను ఎత్తుకుని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. అధ్వానంగా మారిన తండా రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: రీల్స్ కోసం ఎచ్చులకు పోయి.. విషాదం
Comments
Please login to add a commentAdd a comment