40 మంది చిన్నారులు.. మృత్యు లారీ | Huge Road Accident In Kurnool District | Sakshi

40 మంది చిన్నారులు.. మృత్యు లారీ

Dec 16 2020 4:26 AM | Updated on Dec 16 2020 4:31 AM

Huge Road Accident In Kurnool‌ District - Sakshi

రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

ఆళ్లగడ్డ/శిరివెళ్ల: వాళ్లంతా పది, పదిహేనేళ్లలోపు చిన్నారులు. దేవుడిపై ఎనలేని భక్తితో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ప్రార్థన కోసం బయలుదేరారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిలో నలుగుర్ని పరలోకాలకు తీసుకుపోయింది. ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద కర్నూలు–కడప జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పొగమంచు కమ్ముకోవడం, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివరాల్లోకి వెళితే... యర్రగుంట్ల దళితవాడలో ఈ నెల 1వ తేదీన క్రిస్మస్‌ ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. భక్తులతో కలిసి 30 మందికి పైగా చిన్నారులు ప్రతిరోజు తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం వేకువజామున 4 గంటలకు ఆ ప్రాంతంలోని చర్చి ఆవరణ నుంచి బయలుదేరారు. మరో కాలనీకి వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి కడప వైపునకు వేగంగా వెళ్తున్న డీసీఎం లారీ వారి మీదుగా దూసుకెళ్లింది. దీంతో గుంపుగా వెళ్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. సమీపంలోని వారు గమనించి అక్కడికి చేరుకునేలోపు చిన్నారులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ప్రమాదంలో స్థానిక విమల ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఉప్పలపాటి వెంకటరమణ కూతురు ఝాన్సీ (15) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శిరివెళ్ల ఏపీ మోడల్‌ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న దాసరి సురేష్‌ కుమార్తె సుస్మిత (15), అదే స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ (12), మండల పరిషత్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న దాసరి బాలుగ్రం కుమారుడు హర్షవర్దన్‌ (8) నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

12 మందికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో తోట సువర్ణ, సుంకేసుల చెన్నమ్మ, సాయగాళ్ల మైథిలి, మేకల మద్దిలేటమ్మ, బాలబోయిన స్పందన, దాసరి చెన్నకేశవులు, కొత్తమాసి విజయకుమార్, మట్టల లక్ష్మిభార్గవ్, దాసరి నరసింహ, బేతి అరవింద్, దాసరి లక్ష్మి, ప్రవల్లిక తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సాయగాళ్ల మైథిలి, బాలబోయిన స్పందన, తోట సువర్ణ, దాసరి నరసింహ, మేకల మద్దిలేటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీని ఆపకుండా వెళ్లిపోతుండగా.. కొందరు యువకులు వెంబడించి ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో అడ్డుకుని డ్రైవర్‌ను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ ఖాజామొహిద్దీన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, డీఎస్పీ రాజేంద్ర ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పాస్టర్‌ రాకపోయినా బయలుదేరి..
గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ఏడాది నూతన చర్చి నిర్మించి.. క్రిస్మస్‌ ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా రెండు వారాల నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పాస్టర్‌ సొంత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో కాలనీలోని కొందరు యువకులు రాత్రి చర్చిలోనే బస చేశారు. తెల్లవారుజామున పాస్టర్‌ లేకపోయినా వారే ప్రార్థనలు ప్రారంభించి ముందుకు సాగుతుండగా కాలనీలోని సుమారు 40 మంది చిన్నారులు కూడా హుషారుగా వారితో బయలుదేరారు. ప్రమాదంలో మృత్యువాత పడిన చిన్నారులు, క్షతగాత్రులందరిదీ ఒకే వాడ. అంతా కలిసిమెలిసి ఆటపాటలతో సందడి చేసే చిన్నారుల్లో నలుగురు మరణించారని, మరికొందరు గాయపడ్డారని తెలిసి గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు.  

అవ్వ కళ్లముందే మనుమరాలు మృతి
చాగలమర్రి మండలం డి.వనిపెంట గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటరమణ కుమార్తె ఝాన్సీ చిన్నతనం నుంచీ యర్రగుంట్లలో అవ్వతాతల ఉంటూ చదువుకుంటోంది. రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. బాలికకు తోడుగా వెళ్లిన అవ్వ సువర్ణ తీవ్ర గాయాలపాలైంది. యర్రగుంట్ల గ్రామానికే చెందిన సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ మరణించగా.. కుమార్తె మైథిలి రెండు కాళ్లు పోగొట్టుకుని మృత్యువుతో పోరాడుతోంది. ఎప్పుడూ ప్రార్థనకు వెళ్లని చిన్నారి సుస్మిత తోటి పిల్లలతో సరదాగా వెళ్లి మృత్యువాత పడటాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement