విషాదం: ఏం కష్టం వచ్చిందో!  | Husband And Wife Deceased In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఏం కష్టం వచ్చిందో! 

Published Thu, Jan 14 2021 1:07 PM | Last Updated on Thu, Jan 14 2021 5:02 PM

Husband And Wife Deceased In Srikakulam District - Sakshi

చిరంజీవి, లతాశ్రీ(ఫైల్‌)

ఇచ్ఛాపురం(శ్రీకాకుళం జిల్లా): దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పండుగపూట అందర్నీ విషాదంలోకి నెట్టారు. ఈ ఘోరం ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామంలో చోటుచేసుకోగా.. చిరంజీవి, లతాశ్రీ తనువు చాలించి రెండేళ్ల బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్తకన్న గ్రామంలోని తోటవీధికి చెందిన తాపీమేస్త్రీ బొబ్బిలి నరసింహులు, భూదేవిల రెండో కుమారుడు చిరంజీవి (24) అదే గ్రామం మంగళకాలనీకి చెందిన పద్మ, రాజాల కుమార్తె లతాశ్రీ(24ని ప్రేమించాడు. (చదవండి: తెలంగాణలో ఒకరిని.. ఆంధ్రాలో మరొకరిని..

ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకొని వారి ప్రేమను గెలిపించుకొన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా రెండేళ్ల క్రితం చిన్నారి మానస్‌ జన్మించాడు. వీరికి ఒకరంటే మరొకరికి ఎనలేని అభిమానం. అయితే ఇంతలో ఏం కష్టం వచ్చిందోగాని ఈ లోకం నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు వస్తుండేవని, వెంటనే సర్దుకొని సంతోషంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా దంపతులు గొడవ పడినట్టు తెలిసింది. బుధవారం ఉదయం లతాశ్రీ తండ్రి రాజు వీరి ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పటికీ ఎంతసేపటికీ తీయలేదు.(చదవండి: మాయమాటలు చెప్పి.. చిన్నారిని తీసుకెళ్లి..

దీంతో అనుమానంతో స్థానికుల సహకారంతో ఇంటి తలుపు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి కుమార్తే లతాశ్రీ, అల్లుడు చిరంజీవి ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరివేసుకొని చనిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని ఎస్సై వి.సత్యనారాయణ సందర్శించి వివరాలు సేకరించారు. లతాశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై చెప్పారు. దంపతుల ఆత్మహత్యతో పండగపూట రత్తకన్న గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  


   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement