తల్లీ కూతుళ్లు మృతి చెందిన నేలబావి
శ్రీకాకుళం రూరల్: కట్టెలు కొట్టేందుకు నేలబావిలోకి దిగిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ముందు కుమార్తె కాలు జారి పడగా.. ఆమెను రక్షించేందుకు తల్లి బావిలోకి దూకింది. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పంతులుపేట గ్రామ సమీపంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గూడెం గ్రామానికి చెందిన పొదిలాపు భాస్కరరావు కూలి పనులు చేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అతని భార్య ఉమ (37), కుమార్తె అనురాధ (14) ఒక బంధువుతో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వంట చెరుకు కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పంతులుపేట గ్రామం వెళ్లారు. జీడి, సరుగుడు తోటల్లో కట్టెలు ఏరుకొని, నేలబావిలో ఉన్న తాటి కమ్మలు కోసేందుకు ప్రయతి్నంచారు. ఈ ప్రయత్నంలో అనురాధ ప్రమాదవశాత్తు నూతిలో పడిపోయింది.
కూతుర్ని రక్షించమని కేకలు వేస్తూ ఆమెను కాపాడేందుకు ఉమ కుడా దూకేసింది. చుట్టుపక్కల పొలం పనులు చేస్తున్న ఒకరిద్దరు కొబ్బరి కొమ్మల సహాయంతో వారిని నూతిలో నుంచి పైకి తీసుకువచ్చారు. అప్పటికే అనురాధ పూర్తిగా నీరు తాగి ప్రాణాలు కోల్పోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లి ఉమను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్లు నేలబావిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో గూడెం గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ఈ ప్రమాదంలో మరణించిన అనురాధ రాగోలు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఆమె సోదరుడు పవన్‌కుమార్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment