టెర్రస్ మీద ఉన్న షెడ్డుకు ఉరేసుకుని బలవన్మరణం
ఒంగోలు టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కి చెందిన కాలేజీలో ఘటన
ఫీజుల కోసం వేధించి తన బిడ్డ ప్రాణాలు తీశారంటూ తల్లి ఆవేదన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందిన శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్‌కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది.
కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్‌ఆర్ సురే‹Ù, కేర్ టేకర్ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment