ఎస్‌బీ ఆర్గానిక్స్ పేలుడు కేసులోలోతైన దర్యాప్తు
డీఆర్‌డీఓ, ఐఐసీటీ సంస్థల సహకారం కోరిన పోలీసుశాఖ
40 చోట్ల రసాయన అవశేషాల శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ విభాగం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో పదిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్పోటన మని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చా రు. ఈ పరిశ్రమలో పేలుడుకు పదార్థాల (ఎక్స్ ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యక లాపాలు జరిగినట్లు భావిస్తున్నారు.
ఈ పరిశ్రమకు ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి.. ఇక్కడ ఏ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లో ఉన్న ఈ పరిశ్రమలో ఈనెల 3న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషయం విదితమే.
సుమారు 17 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాక్టర్ పేలిన ఘటనలో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా శిథిలమైపోయింది. చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్స్‌ప్లోసివ్ (పేలుడు పదార్థాల)కు సంబంధించిన కార్యకలాపాలు ఈ ఫ్యాక్టరీలో జరిగాయనే దానిపై నిర్ధారణకు వచ్చారు.
డీఆర్‌డీవో సహకారం కోరిన పోలీసులు
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు పోలీసులు రక్షణశాఖకు సంబంధించిన డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సహకారాన్ని కోరారు. ఈ మేరకు పోలీసుశాఖ డీఆర్‌డీఓకు లేఖ రాసింది. అలాగే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని పోలీసులు ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థకు కూడా లేఖ రాశారు.
40 శాంపిల్స్ సేకరణ..
ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా చెల్లాచెదురైన శిథిలాల నుంచి కెమికల్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సేకరించారు. మొత్తం 40 చోట్ల ఈ శ్యాంపిల్స్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్.రూపేష్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment